మద్దతివ్వని కేంద్రం (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మద్దతివ్వని కేంద్రం (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 15 (way2newstv.com) : 
దేశానికి వెన్నెముక రైతని, రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర పాలకులు హామీలు గుప్పించడం తప్ప ఆచరణ కనిపించడం లేదని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పండించిన వరికి మద్దతు ధర కంటితుడుపుగా పెంచుతున్నాయని రైతులు వాపోతున్నారు. వరికి మద్దతు ధర పెంచాలని రైతు సంఘాలు, రైతులు ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మద్దతు ధర పెరుగుతుందని ప్రతీ సంవత్సరం ఎదురు చూస్తున్న రైతుకు ప్రతీ సంవత్సరం నిరాశ తప్పడం లేదు. ఈ ఏడాది కూడా మద్దతు ధర క్వింటాకు 65 రూపాయలు పెంచి రైతులకు నిరాశ శమిగిల్చిందని రైతులు తెలియజేస్తున్నారు. ఆశించినస్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో నిరాశతోనే రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
మద్దతివ్వని  కేంద్రం (శ్రీకాకుళం)

వరి క్వింటాకు సాగు వ్యయం రైతు లెక్క ప్రకారం గ్రేడ్‌–1 రకానికి రూ.2,500లు, సాధారణ రకానికి రూ.2,200 అవుతుంది. ప్రభుత్వం మాత్రం క్వింటాకు ఖర్చు రూ.1,208 అని లెక్కలు చెబుతుంది. ప్రభుత్వం పెంచిన అత్యధిక మద్దతు ధర రూ.1,835గా ఉంది. గతేడాది వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,750 ఉండగా ఈ ఏడాది రూ.1,815కు పెరిగింది. మేలు రకం రూ.1,770 ఉండగా రూ.1,835కు చేరింది. దీంతో రైతు సాగు వ్యయం ప్రకారం చూసినా వరి పండించే రైతు సుమారు రూ.600 నష్టపోవాల్సి వస్తుంది. వరికి కనీస మద్దుతు ధర క్వింటాకు రూ.3000 ఉండాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్ర  ప్రభుత్వం వద్ద మొర పెట్టుకుంటున్నారు. అవి ఏమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి కంటితుడుపుగా మద్దతు ధర పెంచుతుందని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019–20వ సంవత్సరాకి వరి పంటకు క్వింటాకు రూ.65 పెంచింది. వరి పంట పండించే రైతులు కష్టాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని నియోజకవర్గంలోని పలువురు రైతులు వాపోతున్నారు.సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రైతులకు వరి పంటే ప్రధాన పంట. ప్రతీ సంవత్సరం వరి పండించడం వల్ల నష్టాలు చవిచూడడం జరుగుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 45 వేల ఎకరాల్లో సుమారు 50 వేల మంది రైతులు వరి పంటను పండిస్తుంటారు. ప్రభుత్వాలు వ్యయం ప్రకారమైనా మద్దతు ధర పెంచాలని, దీనిపై కేంద్ర పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వరి పంట సాగు చేయాలంటే  రైతులు భయ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కౌలుకు సాగు చేయడానికి కూడా కౌలు రైతులు ముందుకు రావడం లేదు. ఎకరా వరి సాగు చేయడానికి, నారు మడి తయారి, పొలం తయారి, నాట్లు వేయడం, ఎరువులు, కోతలు, నూర్పు చేయడం, కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం చేర్చే వరకు ఎకరానికి సుమారు రూ.25 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. సక్రమంగా దిగుబడి వస్తే రూ. 30 వేలకు పైగా ఆదాయం వస్తుందని రైతులు తెలుపుతున్నారు.  ప్రకృతి విపత్తుల వల్ల పంటనాశనం  అయితే రైతులు కోలుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.