డింపుల్ వర్సెస్ జయప్రద - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డింపుల్ వర్సెస్ జయప్రద

లక్నో, జూలై 20, (way2newstv.com)
వారిద్ద‌రూ సీనియ‌ర్ మ‌హిళా నేత‌లు.. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వేర్వేరు స్థానాల నుంచి బ‌రిలోకి దిగిన వీరు ఓట‌మిపాల‌య్యారు. తాజాగా.. ఓ అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌ల్లో మాత్రం వారిద్ద‌రూ త‌ల‌ప‌డబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ గెలుపు ఇద్ద‌రికీ ప్ర‌తిష్టాత్మ‌క‌మే. అందుకు ఆ స్థానంలో హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దేశంలోనే అత్యంత కీల‌క రాష్ట్రంగా చెప్పుకునే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ ఆస‌క్తిక‌ర‌పోరుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో వారిద్ద‌రినీ ఓడించి.. అక్క‌డ పాగా వేయాల‌ని బీఎస్పీ కాచుకుని కూర్చుంది.ఇంత‌కీ ఆ ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? వారు మ‌రెవ‌రో కాదు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్‌యాద‌వ్ స‌తీమ‌ణి, మాజీ ఎంపీ డింపుల్‌యాద‌వ్.
డింపుల్ వర్సెస్ జయప్రద

మ‌రొక‌రు అల‌నాటి అందాల తార‌, మాజీ ఎంపీ జ‌య‌ప్ర‌ద‌. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో క‌నౌజ్ పార్ల‌మెంట్ స్థానం నుంచి ఎస్పీ అభ్య‌ర్థిగా డింపుల్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాంపూర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా జ‌య‌ప్ర‌ద పోటీ చేసి ఆజంఖాన్ చేతిలో ఓడిపోయారు.అయితే.. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. రాంపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆజంఖాన్ ఇదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఇక్క‌డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. మ‌రికొద్ది రోజుల్లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ స్థానంలో 1980 నుంచి ఎస్పీ ఒక్క‌సారి కూడా ఓడిపోలేదు. దీంతో ఇక్క‌డ డింపుల్ యాద‌వ్‌ను బ‌రిలోకి దించితేనే గెలుపు సులువు అవుతుంద‌ని ఎస్పీ పెద్ద‌లు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎంపీగా ఓడిన డింపుల్‌ను ఇక్క‌డ గెలిపించుకుని స‌త్తా చాటాల‌ని అఖిలేశ్ భావిస్తున్నారు.ఇక ఇదే స‌మ‌యంలో.. డింపుల్‌కు పోటీగా జ‌య‌ప్ర‌ద‌ను బ‌రిలోకి దించాల‌ని బీజేపీ నేత‌లు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విష‌యంలో జ‌య‌ప్ర‌ద కూడా పార్టీ పెద్ద‌ల‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు బీఎస్పీ కూడా సీరియ‌స్‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు.. ఆ త‌ర్వాత విడిపోయి..ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో డింపుల్‌కు బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం క‌ష్టమ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాంపూర్ ఉప ఎన్నిక దేశంలోనే హాట్‌గా మార‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి.. ఏం జ‌రుగుతుందో..!