సమస్య తీరదా..? (విజయవాడ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమస్య తీరదా..? (విజయవాడ)

విజయవాడ, జూలై 5 (way2newstv.com): 
దుర్గమ్మ భక్తుల వాహనాల పార్కింగ్‌ సమస్య నేటికీ పరిష్కారం కావడం లేదు. కార్యనిర్వహణాధికారులు మారుతున్నా.. భక్తులు వాహనాలు ఎక్కడ నిలపాలి. ఎటు వైపు నుంచి దర్శనం చేసుకోవాలి అన్న భక్తుల సందేహాలను నివృత్తి చేసే వారు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన తరువాత దుర్గమ్మ దర్శనానికి వచ్చే సాధారణ భక్తులతో పాటు వీఐపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 
సమస్య తీరదా..? (విజయవాడ)


 సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రముఖులతో పాటు సామాన్య భక్తులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. దుర్గగుడి టోల్‌గేటు నుంచి జాతీయ రహదారిపైకి వాహనాలు బారులు తీరుతున్నాయి. అయినా సమస్య పరిష్కారానికి దేవస్థానం అధికారులు చొరవ చూపడం లేదు. వాహనాల పార్కింగ్‌ కోసం తితిదే స్థలాన్ని వినియోగించుకోవాలని గత పాలకమండలి పలు సమావేశాల్లో తీర్మానం చేసినప్పటికీ అధికారులు దృష్టి కేంద్రీకరించక పోవడంతో సమస్య అలాగే ఉంది.దేవస్థానం స్వాధీనం చేసుకున్న కుమ్మరిపాలెం సెంటరు సమీపంలోని తితిదే స్థలం గత ఐదేళ్లుగా వృథాగా ఉంది. రూ.కోట్లు విలువైన ఆ స్థలాన్ని సోమా కంపెనీ పైవంతెనకు సంబంధించిన వింగ్స్‌ పెట్టుకునేందుకు వినియోగిస్తోంది. గత మూడేళ్లుగా దేవస్థానం ఆ స్థలాన్ని వాడుకోడానికి పైవంతెన నిర్మాణ సామగ్రి ఆటంకంగా మారింది. దసరా, భవానీ దీక్షల సమయంలో దీక్ష వస్త్రాల సేకరణ గుత్తేదారు వాటిని ఎండబెట్టేందుకు ఉచితంగా వినియోగించుకుంటున్నారు. దుర్గగుడి అధికారులు మాత్రం ఆ స్థలాన్ని వాడుకలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. రోజుకు ఆరు వేల వాహనాలు ఘాట్‌ రోడ్డులో నిలపాల్సి వస్తోంది. ఒక వేళ పైన ఎక్కువ వాహనాలు నిలిపితే కింద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఆగిపోతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి పార్కింగ్‌ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.దశాబ్దం కిందటే కనకదుర్గానగర్‌లో బహుళ ప్రయోజన భవన సముదాయం నిర్మించాలని దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం దాటి ప్రభుత్వం దృష్టికి వెళ్లకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కనకదుర్గానగర్‌లో భవనాన్ని నిర్మిస్తే రెండు అంతస్తుల్లో వాహనాలు నిలిపేందుకు ఉపయోగించడంతో పాటు పైనున్న భవనాలను ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు పడుతుంది. భవన సముదాయ నిర్మాణం కార్యరూపం దాల్చితే ఘాట్‌ రోడ్డు వెడల్పు కూడా గణనీయంగా పెరుగుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అందుకు రూ.80 కోట్లు వెచ్చించి స్థల సేకరణ చేసిన తరువాత కూడా సరైన ప్లానింగ్‌ లేకుండా పెర్గొలా నిర్మాణం చేపట్టారు. అది దేవస్థానానికి శిరోభారంగా మారింది. ఆ నిర్మాణం భక్తులకు ఎందుకూ ఉపయోగపడకపోగా.. భక్తుల వాహనాలు నిలపడానికి అడ్డంకిగా మారింది.