పుష్కర ఎత్తిపోతల పథకానికి మోక్షమెప్పుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పుష్కర ఎత్తిపోతల పథకానికి మోక్షమెప్పుడు


రాజమండ్రి, జూలై 8, (way2newstv.com)
మెట్ట ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామల చేసే పుష్కర ఎత్తిపోతల పథకం ఇంకా తెరుచుకోలేదు. వాస్తవానికి ఈ సమయానికి నాట్లు ముమ్మరంగా సాగాల్సి ఉంది. కానీ సాగునీరు ఇంకా అందని పరిస్థితిలో ఆయకట్టు ఎదురు చూస్తోంది. గోదావరి జలాలను ఎక్కడికో పట్టుకు పోదామని ఆలోచన జరుగుతోంది గానీ చెంతనే ఉన్న ఎత్తిపోతల పథకాలకు మాత్రం ఇంకా నీరందని పరిస్థితి దాపురించింది. గోదావరి డెల్టాకు ఇబ్బంది లేకుండా చూసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు పట్టుకెళ్లాలని రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో కృష్ణా డెల్టాకు సాగునీరు బదిలీ చేసే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సీజన్ మొదట్లో రెండు మూడు రోజులపాటు నీటిని తోడేసి ఆపై నిలిపి వేశారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో డెల్టాలకు పోను మిగిలిన మెట్ట ప్రాంతానికి ప్రధానంగా సాగునీరు అందించే పుష్కర ఎత్తిపోతల పథకం మాత్రం ఇంకా నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టకపోవడంతో మెట్ట ఆయకట్టు నోరెళ్లబెట్టి చూస్తోంది.
పుష్కర ఎత్తిపోతల పథకానికి మోక్షమెప్పుడు

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకం పంపుహౌస్ వద్ద శనివారం గోదావరి నీటి మట్టం 14.1 మీటర్లు నమోదైంది. ఇక్కడ 13 మీటర్ల నీటి మట్టం ఉంటేనే పుష్కర పథకం నుంచి మెట్టకు నీటిని విడుదల చేయాలి. పుష్కర ఎత్తిపోతల పథకం పంపులను ఆన్ చేసి నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. పట్టిసీమ పథకం నుంచి నీటిని తోడాలంటే ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం 13 మీటర్లు ఉండాల్సి ఉంది. అపుడే పట్టిసీమ నుంచి కూడా నీటిని తోడాల్సి ఉంది. అయితే పుష్కరకు నీటిని విడుదల చేయడం మొదలు పెడితే ప్రస్తుతం గోదావరి నీటి లభ్యతను బట్టి చూస్తే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పట్టిసీమకు అవసరమైన నీటి మట్టం నమోదు కాదనే ఆలోచనతోనే కావాలని పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ఇంకా ఆన్ చేయలేదని రైతులు అనుమానిస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని 13 మండలాల్లో 1.86 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఈ పధకం ద్వారా పంప్‌హౌస్‌లోని 8 పంపుల ద్వారా రోజుకు 1,400 క్యూసెక్కుల జలాలను తోడేందుకు రూపొందించారు. అయితే పంప్‌హౌస్ వద్ద నీటి లభ్యత ఆశాజనకంగానే ఉంది. ఈ పథకానికి రెండో పంప్‌హౌస్ నుంచి సీతారాంపురంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల ద్వారా అనేక గ్రామాల్లోని వ్యవసాయ భూములకు పుష్కర జలాలు అందడం లేదు. మెట్ట ప్రాంతంలో సాగునీరు అందక పోవడం వల్ల అనేక ప్రాంతాల్లో నేటికీ ఏరువాక మొదలు కాలేదు. మెట్ట ప్రాంతంలో పుష్కర సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జగ్గంపేట మండలం గోవిందపురం, కాండ్రేగుల, మన్యంవారి పాలెం, నరేంద్రపట్నం, మామిడాడ గ్రామాల్లో నేటికీ ఆకుమడులు కూడా పడలేదు. అంతేకాకుండా ప్రతీ ఏడూ వేసవి సీజన్‌లో మెట్ట ప్రాంతంలో సుమారు 200 చెరువులకు పుష్కర జలాలను విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది విడుదల కాలేదు. దీంతో భూగర్భ జలాలు మరింత అడుగంటే పరిస్థితి దాపురించింది. ఉష్ణోగ్రతలు కొనసాగుతుండటంతో పుష్కర ఆధారిత చెరువుల ఆయకట్టుకు కూడా నీరందని పరిస్తితి ఎదురైంది. మెట్ట ప్రాంతంలోని కోరుకొండ, గోకవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తుని, గండేపల్లి, రంగంపేట, పిఠాపురం, మండలాల్లోని రైతులు తక్షణం పుష్కర ఎత్తిపోతల పధకం మోటార్లను ఆన్ చేసి తక్షణం సాగు జలాలను విడుదల చేయాలని కోరుతున్నారు.వాస్తవానికి జూలై మొదటి వారానికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ నారుమడులు కూడా పూర్తి కాలేదు. ఒక వైపు వర్షాలు లేకపోవడం వల్ల, మరోవైపు పుష్కర నీటి విడుదల లేకపోవడం వల్ల కనీసం నారుమడులకు కూడా ఈ సీజన్‌లో ఇంకా నోచుకోలేదని రైతులు వాపోతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాలకు జూన్ ఒకటో తేదీకి గోదావరి సాగుజలాలను విడుదల చేశారు. కానీ మెట్టకు నీరందించే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని మాత్రం ఇంకా ఆన్ చేయలేదు. డెల్టాలకు సాగునీరు అందినప్పటికీ సకాలంలో నాట్లు పడటం లేదు. మెట్టలో సాగునీరు లేక నాట్లు ఇంకా నాట్లు పడలేదు. ఇదీ ఈ ఏడాది ఖరీఫ్ పరిస్థితి.ఇదిలా ఉండగా జిల్లాలో మెట్టకు నీరందించాల్సిన పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ఇంకా రన్ చేయకుండా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శనివారం 10.90 అడుగుల నీటి మట్టం నమోదైన క్రమంలో పట్టిసీమ మూడు పంపుల ద్వారా 1062 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు పట్టుకెళ్తున్న వైనం కనిపించింది. అయితే గోదావరి నదిలో 26,292 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సీలేరు నుంచి 3182 క్యూసెక్కులు గోదావరి జలాల్లో కలుస్తున్నాయి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ధవళేశ్వరం నుంచి తూర్పు డెల్టాకు 1090 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1090 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1060 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు.