సిటీలో డేంజర్ బెల్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో డేంజర్ బెల్స్

హైద్రాబాద్, జూలై 10, (way2newstv.com)
గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నీటి గండం పొంచి ఉంది. ఇప్పటికే సిటీలోని సగం ప్రాంతాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. ఓ వైపు వానలు మొహం చాటేయడం, రిజర్వాయర్లు ఎండిపోవడం, మరోవైపు విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయడం వంటివి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు తగినట్టుగా నీళ్లు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సిటీ శివార్లలో అయితే వారానికోసారే నల్లా నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందని, వానలు కురవకపోతే సిటీలో తాగునీటికి కూడా ఇబ్బంది తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.హైదరాబాద్ చుట్టూ ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల రాకతో నగర జనాభా విపరీతంగా పెరుగుతోంది. 
సిటీలో డేంజర్ బెల్స్

2011 లెక్కల ప్రకారం నగర జనాభా 33 లక్షలుకాగా.. ఇప్పుడు ఏకంగా కోటీ 20 లక్షలు దాటినట్టు అంచనా. ఈ లెక్కన రోజూ 570 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే) నీళ్లను సరఫరా చేయాల్సి ఉంది. 2021 నాటికి నగర జనాభా 1.4 కోట్లకు చేరుతుందని.. గృహావసరాలు, కమర్షియల్, ఇతర పనుల కోసం 730 ఎంజీడీల నీళ్లకు డిమాండ్ ఉంటుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రానున్న పదేళ్లలో జనాభా 2.3 కోట్లకు చేరితే.. 1,203 ఎంజీడీ నీటి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు, హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల నుంచి నీటిని తరలించి సరఫరా చేస్తున్నా.. నగరంలోని పలు కాలనీలకు, శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాలకు నీటి తిప్పలు తప్పడం లేదు.ప్రస్తుతానికి సిటీలో రోజూ 470 ఎంజీడీల మేర నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీళ్లు సగం జనాభాకే సరిపోతున్నాయి. మిగతా వారంతా బోర్లపైనే ఆధారపడి ఉన్నారు. అయితే రెండేళ్లుగా వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గత ఐదేళ్లుగా నిర్మాణాలు పెరిగిపోతుండటం, విచ్చలవిడిగా బోర్లు వేస్తుండటంతో గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలపై ఎఫెక్ట్ పడింది. సగటున ఎనిమిది, తొమ్మిది మీటర్ల లోతులో ఉండే జలాలు.. ప్రస్తుతం 12 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో 20 మీటర్లకు, మరికొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇప్పుడు నైరుతి రుతు పవనాల రాక ఆలస్యమై ఇప్పటికీ తగిన వర్షపాతం నమోదు కాలేదు. దాంతో భూగర్భ జలాలు మరింత తగ్గిపోతున్నాయి. జంట నగరాల్లో జూన్ నుంచి జూలై తొలివారం వరకు సాధారణ వర్షపాతం 139.7 మిల్లీమీటర్లుకాగా.. ఈసారి 122.5 మిల్లీమీటర్లే (12 శాతం లోటు) కురిసింది. అటు రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు అడుగుకు చేరాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. చెన్నై తరహాలో హైదరాబాద్ కూడా తీవ్రంగా నీటి కటకట ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండీఈ ఆధ్వర్యంలో నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన మేర ఫలితాలు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో ఇంకుడు గుంతల ఏర్పాటు వంటివి జరగడం లేదు. నగరం పరిధిలో 28 లక్షలకుపైగా నివాసాలు ఉండగా.. కనీసం పదిశాతం ఇండ్లలో కూడా ఇంకుడు గుంతలు లేవని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. నగరంలో కురిసే వాన నీళ్లలో 70 శాతానికిపైగా డ్రైనేజీల్లో ప్రవహిస్తోంది. ఇక వాటర్ బోర్డు సరఫరా చేసే నీటిలో 20 శాతానికి పైగా వృథాగానే పోతోందని అంచనా. వేసవిలో నీటి కొరత కారణంగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్పై ఆంక్షలు విధించారు. ఇక ముందు పరిస్థితి ఇలానే ఉంటే.. రేషన్ విధానంలో నీటి ట్యాంకర్లను కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే సిటీ శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు.
నగరంలో నీటి అవసరాలు..
సరఫరా అయ్యే నీరు:  470 ఎంజీడీలు
నల్లా కనెక్షన్లు: 9.8 లక్షలు
నీటి డిమాండ్: 550 ఎంజీడీలు
2021  నాటికి నగర జనాభా: 1.4 కోట్లు (అంచనా)
నీటి డిమాండ్ అంచనా: 730 ఎంజీడీలు