అన్నదాతకు అగ్నిపరీక్ష (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నదాతకు అగ్నిపరీక్ష (విజయనగరం)

విజయనగరం, జూలై 27  (way2newstv.com): 
వరుణుడు రైతన్నకు అగ్ని పరీక్ష పెడుతున్నాడు. నారుమళ్లు వేసుకోవడానికే నీళ్లు లేని పరిస్థితి. సమయం మించిపోతున్నా నేటికీ జిల్లాలో సగం భూముల్లోనే నారు పడింది. మరోవైపు ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదోలా విత్తనాలు నాటుకున్న కర్షకులకు రుణసాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు పాతవారికే తప్ప కొత్త రుణాలివ్వడానికి ముందుకు రావట్లేదు. పైగా ఖరీఫ్‌లో రూ.1,640 కోట్ల రుణ లక్ష్యమున్నా ఇప్పటివరకూ రూ.470 కోట్లు మాత్రమే ఇచ్చారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అర్థం చేసుకోవొచ్ఛు అందుకే కర్షకులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు.జిల్లాలో 4,46,845 మంది రైతులుంటే వారిలో చిన్న, సన్నకారు రైతులే 4,12,624 మంది. అంటే జిల్లాలో 92.34 శాతం మంది చారెడు నేలకు బందీలై సాగు జీవనాధారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. వారంతా పేరుకి యజమానులే తప్ప 10 సెంట్లు, 20 సెంట్లు ఉన్నవారే అత్యధికంగా కనిపిస్తున్నారు. 
అన్నదాతకు అగ్నిపరీక్ష (విజయనగరం)

అసలే తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ముందుకు సాగట్లేదు. మరోవైపు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ప్రధానంగా చిన్న చిన్న భూఖండాల రైతాంగమంతా సాగుకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్షకులకు వరి పంటకు గాను ఎకరానికి రూ.33,000 వరకూ రుణసాయం అందించనున్నట్లుగా ఇప్పటికే ఉన్నతాధికారులు సైతం ప్రకటించారు. కాని బ్యాంకుల పరంగా రుణసాయం కొరవడింది. జిల్లాలో వాణిజ్యబ్యాంకులు, సహకారబ్యాంకుల ద్వారా రుణలక్ష్యాలను ఏటా నిర్దేశిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రైతాంగానికి రూ.1,850 కోట్ల రుణసాయం అందించాలని లక్ష్యంగా విధించారు. దీంట్లో ఖరీఫ్‌కు 1,640 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాని ఇప్పటివరకూ రూ.470 కోట్లు మాత్రమే బ్యాంకులు ఇచ్చాయి. ఇప్పటికే ఖరీఫ్‌కి గాను దాదాపు మూడు నెలల కాలం ముగుస్తున్నా రుణవితరణ నత్తనడకన సాగుతుంది. పైగా ఇచ్చిన రుణాల్లోను ప్రధానంగా పునరుద్దరణ రుణాలకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. కొత్తగా రైతులకు రుణాలిచ్చే పరిస్థితి ఇంకా ప్రారంభం కాలేదని ఆయా వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. దీంతో అత్యధిక శాతం మంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు కొందరి రైతులకైతే గత ప్రభుత్వ రుణమాఫీలో అయిదో విడతగా ఉండిపోయిన బకాయిలు వేధిస్తున్నాయి. వాటిని తీరిస్తే తప్ప మళ్లీ రుణాలిచ్చేందుకు అవకాశం లేదని బ్యాంకులు చెబుతుండడంతో పాత అప్పుని పునరుద్దరించుకోక తప్పని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు లక్ష మంది రైతులు సహకార రుణాలపైనే ఆధారపడుతున్నారు. ఏటా ఆప్కాబ్‌ ద్వారా వచ్చే నిధులపైనే వారికి రుణసాయం ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.250 కోట్ల రుణ లక్ష్యం విధించినా నేటికీ రూ.45.46 కోట్లు మాత్రమే వితరణ జరిగింది. అటు వాణిజ్య బ్యాంకుల్లోనే కాకుండా సహకారం సంఘాల్లోను వడ్డీని జమచేసుకుని రుణబకాయిలను పునరుద్దరించే సర్దుబాటు విధానమే అమలవుతుంది. ఏటా కొత్త రైతులకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ అందించగలుగుతున్నారు. ఈ ఏడాది అదీ అనుమానమేనని సహకారరంగ వర్గాలే చెబుతున్నాయి.