పుస్తకాలకోసం ప్రదక్షిణలే.. (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పుస్తకాలకోసం ప్రదక్షిణలే.. (కరీంనగర్)

కరీంనగర్, జూలై 27  (way2newstv.com): 
కొత్త పాస్‌పుస్తకాల పుణ్యమా అని నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడం.. ఇంకా వేల మందికి చేరకపోవడంతో అటు రుణానికి ఇటు రైతుబంధు సాయానికి దూరమవుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాంటి బేషజాలు లేకుండా నిబంధనల ప్రకారం రికార్డులను రూపొందించాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా ఆచరణలో మాత్రం మామూళ్లకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వానికి అపఖ్యాతి అంటగడుతున్నారు. గతంలో పాసుపుస్తకాల్లో ఉన్న వివరాలు కొత్త పాస్‌పుస్తకాల్లో లేకపోవడం.. విస్తీర్ణం ప్రకారం చెక్కులో వివరాలు లేకపోవడం విస్తుగొల్పుతోంది. జిల్లాలో రైతుబంధు కార్యక్రమం కింద పాసుపుస్తకాలతో పాటు ఎకరానికి రూ.5వేల చొప్పుల చెక్కుల పంపిణీ చేస్తుండటం మెజార్టీ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 
పుస్తకాలకోసం ప్రదక్షిణలే.. (కరీంనగర్)

పాస్‌పుస్తకాల్లో దొర్లిన చిక్కులతో కొంతమంది రైతుల్లో మాత్రం తీవ్ర నిరాశ మిగులుతోంది. గత పాసుపుస్తకాల్లో సరిగా ఉండగా ఇపుడెందుకిలా మారుతాయి. ఇందుకు పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులే పనితీరుకు అద్దంపడుతున్నాయి. జిల్లాలో కిందటి ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు భూ దస్త్రాల ప్రక్షాళనలో రైతులవారీగా పూర్తి సమాచారాన్ని వివరాలను 1బిల రూపంలో అందజేయడం, తప్పులు దొర్లితే విజ్ఞప్తులు స్వీకరించడం.. సరిచేయడం వంటివి చేసినప్పటికీ రైతుబంధు కార్యక్రమంలో పొరపాట్లు వెలుగుచూడటం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతోంది.కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన రాచమల్ల మల్లయ్యకు వివిధ సర్వే నంబర్లలో భూమి ఉండగా మూడు సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. సర్వేనంబర్‌ 251కెలో 0.01, 115బిలో 0.17గుంటల భూమిని చేర్చాల్సి ఉండగా కావాలని నిర్లక్ష్యం చేశారు. ఏడాదిగా తిరుగుతుండగా పరిష్కారం శూన్యం. అతని తండ్రి చంద్రయ్య పేరున నమోదులోనూ అదే నిర్లక్ష్యం. ఇలా వేలమందికి తిప్పలు తప్పడం లేదు. దీంతో రైతుబంధు, కిసాన్‌ సమ్మాన్‌ నిధికి దూరమయ్యారు.
భూ దస్త్రాల ప్రక్షాళనతో రైతులకు మామూళ్ల బెడద తీవ్రంగా ఎదురవుతోంది. కార్యాలయానికి వచ్చిన ప్రతి పాసుపుస్తకాన్ని రైతులకు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా పలువురు రెవెన్యూ అధికారులు కావాలని కొర్రీలు పెడుతున్నారు. కాసులకు ముడిపెడుతూ తిప్పుకుంటున్నారు. తప్పులు దొర్లిన పాసుపుస్తకాలను ఇటీవల సరిచేయగా వాటిని పంపిణీ చేస్తున్నారు. సరిచేసే అధికారం కూడా తహసీల్దార్లకే ఇచ్చారు. కానీ జిల్లాలోని ఏ తహసీల్దార్‌ కూడా సరిచేసిన పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామని మీడియాకు చెప్పడం లేదు.