అంతులేని అక్రమాలు (కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతులేని అక్రమాలు (కర్నూలు)

కర్నూలు, జూలై 27  (way2newstv.com): 
జిల్లాలోని మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు వెలుస్తున్నాయి. వందల ఎకరాల సాగు భూములను పురపాలక అనుమతుల్లేకుండానే స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వీటిని విక్రయిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ సంపాదన చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. దీంతో పురపాలక సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయనికి భారీగా గండి పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదు చెల్లింపులను తప్పించుకునేందుకు నిబంధనలేవి పాటించకుండా ఇష్టారాజ్యంగా అనధికార వెంచర్లు వేస్తున్నారు. రుసుముతోపాటు నిర్వహణ ఖర్చులు భరించాల్సి రావడం, పది శాతం స్థలం కేటాయింపు తదితర కారణాలతో లాభాలు తక్కువగా ఉంటాయని భావించడం, రోజుల తరబడి ఎదురుచూడాల్సిరావడం వ్యయ ప్రయాసలు తప్పించుకునే క్రమంలో నాన్‌ లేఅవుట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.
అంతులేని అక్రమాలు (కర్నూలు)

దీనివల్ల ఎలాంటి అప్రూవల్‌ లేకుండానే ప్లాట్లు వేసేసి అమ్మకాలు చేస్తున్నారు.ఆళ్లగడ్డ శివారు నంద్యాల జాతీయ రహదారి పక్కన వేసిన అక్రమ లేఅవుట్లు ఇవి. లేఅవుట్‌కు మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేవు. 8 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. రూ.4 లక్షల దాకా నగర పంచాయతీ ఆదాయానికి గండి పడింది. ఇలా పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు వెలుస్తున్నాయి. అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పట్టణాల్లో రోజురోజుకు జనాభాతోపాటు స్థల సమస్యలు నెలకొంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే నిర్మాణాలు సాగిపోతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరుతోపాటు నగర పంచాయితీల్లో సైతం అక్రమ నిర్మాణాలు సాగిపోతున్నాయి. మరోవైపు ఉన్నత శ్రేణి, ఉద్యోగ, వ్యాపార వర్గాల ఆదాయాలు పెరగడంతో ప్లాట్ల కొనుగోళ్ల వైపు అడుగులేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి ఎప్పటికైనా రెట్టింపవుతుందనే ధీమాతోపాటు సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ఆలోచన ఉండడం తదితర కారణాలు ఉంటున్నాయి. ప్రజల అవసరాలను గుర్తించిన రియల్టర్లు సాగు భూములను ప్లాట్లుగా వేసి విక్రయించేస్తున్నారు. కొనుగోలుదారులకు అవగాహన లేకపోవడం వల్ల వీటివైపు మొగ్గు  చూపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో చిక్కుతున్నారు.