కుషాయిగూడ-ఇ.సి.ఐ.ఎల్ కేంద్రంగా మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కుషాయిగూడ-ఇ.సి.ఐ.ఎల్ కేంద్రంగా మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ

హైద్రాబాద్, ఆగస్టు 21 (way2newstv.com)  
కాప్రా, ఇ.సి.ఐ.ఎల్, నేరేడ్ మెట్, లాలాపేట్, నాగారం తదితర మార్గాల్లో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు, జంక్షన్ల నిర్మాణం, అదనపు ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, పాదచారుల సౌకర్యార్థం ఫుట్ పాత్ ల నిర్మాణం, మెరుగైన ప్రయాణానికి యూటర్న్ ల ఏర్పాటు తదితర అంశాలపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిహెచ్ఎంసి కార్యాలయంలోని తన చాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ట్రాఫిక్, ఆర్టిసి, జిహెచ్ఎంసి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో నగరంలో అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో కుషాయిగూడ ఉందని, కుషాయిగూడ ఇ.సి.ఐ.ఎల్ ప్రధాన జంక్షన్ గా పలు రహదారుల విస్తరణతో పాటు రవాణా సౌకర్యాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 
కుషాయిగూడ-ఇ.సి.ఐ.ఎల్ కేంద్రంగా మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ 

ప్రధానంగా లాలపేట్ నుండి ఇ.సి.ఐ.ఎల్ చౌరస్తా వరకు, నేరేడ్ మెట్ నుండి ఇ.సి.ఐ.ఎల్ చౌరస్తా, నాగారం నుండి ఇ.సి.ఐ.ఎల్ వరకు ఉన్న మార్గాల్లో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటుకు కావాల్సిన ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, యూటర్న్ లు, ఫుట్ పాత్ ల నిర్మాణం, ఫ్రీ లెఫ్ట్ లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. దీనిలో భాగంగా జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అధికారులతో పాటు హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, హెచ్.ఎం.డి.ఏ, ఆర్టీసి, పోలీసు తదితర అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఇ.సి.ఐ.ఎల్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఐల్యాండ్ ను మెరుగు పర్చడం, ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడంతో పాటు, కుషాయిగూడ, చర్లపల్లిలో అధునాతన బస్ బేల ఏర్పాటు, ఐదు రూపాయల అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జవహర్ నగర్ కు వెళ్లే భారీ గార్బేజ్ వాహనాలను మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ ద్వారా కాకుండా ఎన్.ఎఫ్.సి, కేబుల్ చౌరస్తా మీదుగా జవహర్ నగర్ డంప్ యార్డ్ కు మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించగా ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా జిహెచ్ఎంసి ట్రాన్స్ పోర్ట్ విభాగాన్ని కోరనున్నట్టు మేయర్ తెలిపారు.