స్పెషల్ ప్యాకేజీపైనా ఆంక్షలే... (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్పెషల్ ప్యాకేజీపైనా ఆంక్షలే... (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, ఆగస్టు 21 (way2newstv.com): 
ప్రత్యేక ప్యాకేజీ పనులపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జలవనరులు, పంచాయతీరాజ్‌, రక్షిత తాగునీరు తదితర పనులపై నిబంధనలు పెట్టిన ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ప్యాకేజీ పనులనూ ఆ కోవలో చేర్చింది. మంజూరు చేసినప్పటికీ ఇంత వరకు ప్రారంభించని పనులనూ నిలిపేయాలని ఆదేశించింది. ప్రారంభించినప్పటికీ 25 శాతం కంటే తక్కువ చేసిన పనులను సమీక్షించి వాటిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించింది. ఇటీవలే ఈ ఆదేశాలు జారీ చేసింది. పర్యవసానంగా రూ.7.99 కోట్ల విలువైన 77 పనులు రద్దు కానున్నాయి. వీటిలో ఇప్పటికే చేసిన మేరకు చెల్లింపుల విషయమై కసరత్తు చేస్తున్నారు. 
స్పెషల్ ప్యాకేజీపైనా ఆంక్షలే... (శ్రీకాకుళం)

రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు సమకూర్చాలని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంది. ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు ఏటా రూ.50 కోట్ల వంతున కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2015-16, 2016-17 సంవత్సరాలకు ఏటా రూ.50 కోట్ల వంతున.. మొత్తం రూ.150 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులను ఖజానాలో జిల్లా ప్రణాళిక అధికారి వ్యక్తిగత ధరవాత్తు ఖాతా (పీడీ అకౌంట్‌)లో జమ చేసి అభివృద్ధి పనులకు వెచ్చించింది. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం జలవనరులు, పంచాయతీరాజ్‌, రక్షిత తాగునీరు తదితర శాఖలకు సంబంధించిన పనులపైనే పలు ఆంక్షలు పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ పనులు ఇంతవరకు ఆ నిబంధనల పరిధిలోకి తేలేదు. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన నిధులు కావడం వల్లనే ఆ పరిధిలో చేర్చలేదని అనుకున్నంతలోనే.. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నిబంధనలను వర్తింపజేసింది. తాజా ఆదేశాలకు లోబడి ఏ మేరకు పనులు జరిగాయనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.కేంద్రం మూడేళ్ల పాటు నిధులు విడుదల చేసినా.. తదుపరి రెండు విడతల సొమ్ములను విడుదల చేయకుండా అకస్మాత్తుగా నిలిపేసింది. అప్పటికే జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పనులు మంజూరు చేసిన పరిస్థితుల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రూ.100కోట్ల బకాయిలను సర్దుబాటు చేసింది. అయిదేళ్లలో రూ.222.63 కోట్ల అంచనా విలువతో 4,214 పనులను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 2,941 పనులు పూర్తయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.116.50 కోట్లు. ఇంకా 14.63కోట్ల విలువైన 805 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి ప్రారంభించని రూ.12.35 కోట్ల విలువైన 468 పనులు రద్దు పద్దులో చేరనున్నాయి. 25శాతం కంటే తక్కువ చేసిన పనుల అంచనా విలున రూ.7.99 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇందులో ఇప్పటికే రూ.1.03 కోట్లు చెల్లింపులు చేశారు. చేసిన పని వరకు చెల్లించాల్సి వస్తే.. ఇంకా ఆ పనులకు రూ.1.09కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉంది. వీటిపై కలెక్టర్‌ అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చేనేత, మత్స్యసంపద రంగాలకు తొలివిడత నిధుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం రూ50 కోట్లను ఈ రెండు రంగాలకే కేటాయించారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పొందూరు ఖద్దరు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. చేనేత పార్కుకు రూ.30కోట్లను ప్రతిపాదించి పనులు పూర్తి చేశారు. సముద్రంలోనూ.. తీరప్రాంతంలోనూ చెరువులు, జలాశయాల్లో మత్స్య సంపదను పెంపొందించేందుకు రూ.15 కోట్లు వెచ్చించారు. చేనేత, జౌళి శాఖ తరఫున శ్రీకాకుళంలోనే అంబేడ్కర్‌ జంక్షన్‌లో రూ.1.40 కోట్లతో అధునాతన వాణిజ్య సముదాయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 18 చేనేత సంఘాల పరిధిల్లో ఒక్కో సంఘానికి సుమారు రూ.40 లక్షల వంతున మౌలిక వసతులు సమకూర్చేందుకు రూ.7.7కోట్లు కేటాయించి పనులను పూర్తి చేశారు. తరవాత విడతల నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చారు. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.మంజూరు చేసి ఇంతవరకు ప్రారంభించని పనుల్లో అత్యధికంగా పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన పనులే ఉన్నాయి. ఆ శాఖలో శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో రూ.6.34 కోట్ల విలువైన 160 పనులు, టెక్కలి డివిజన్‌లో రూ.3.58 కోట్ల విలువైన 246 పనులు అత్యధికంగా ఉన్నాయి. పాలకొండ డివిజన్‌లోనూ మరో రూ.20 లక్షల మేర తొమ్మిది పనులను గుర్తించారు. ఇవన్నీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులే. రక్షిత తాగునీటికి ఉద్దేశించిన శ్రీకాకుళం డివిజన్‌లోని రూ.49 లక్షల విలువైన 12 పనులు, పలాస డివిజన్‌ పరిధిలోని రూ.24 లక్షల విలువైన 13 పనులు చేరనున్నాయి. శ్రీకాకుళంలోని మత్స్యశాఖ, అటవీశాఖ.. సీతంపేటలోని గిరిజనాభివృద్ధి తదితర శాఖల పరిధిలో ఇతర పనులు ఉన్నట్లు అధికార వర్గాలు విశదీకరిస్తున్నాయి. కలెక్టర్‌తో సమీక్షించిన అనంతరం ఈ పనులను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.