ప్రతీ పంచాయితీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతీ పంచాయితీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ

మరో పథకానికి కేసీఆర్ శ్రీకారం
నల్గొండ, ఆగస్టు 24, (way2newstv.com)
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఓ ట్రాక్టర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌‌లో దీనికి నిధులివ్వాలని ఆలోచిస్తోంది. కొనుగోలు, పంపిణీ గైడ్ లైన్స్‌‌ను కూడా త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో 12,751 పంచాయతీలున్నాయి. మార్కెట్లో ట్రాక్టర్ రేటు రూ.5 లక్షలకు పైనే ఉంది. కంపెనీలు, వాటి మోడళ్ల ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువే అవుతుంది. అన్ని ఊళ్లకు ట్రాక్టర్లు ఇవ్వాలంటే రూ.700 కోట్ల పైన ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో సర్కారు ఖర్చు చేస్తుందా అని అనుమానాలున్నాయి. ప్రస్తుతం సుమారు వెయ్యి మేజర్ పంచాయతీల్లో ట్రాక్టర్లు ఉన్నట్లు కార్మిక నేతలు చెబుతున్నారు. కానీ అవి చాలా కాలం కింద కొన్నవంటున్నారు.
ప్రతీ పంచాయితీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ

కాబట్టి ట్రాక్టర్లు లేని చోటే ఇస్తారా.. లేక అన్ని పంచాయతీలను లెక్కలోకి తీసుకుంటారా తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రాక్టర్లకు ఎక్కువ ఖర్చవుతున్నందున బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌‌గా తీసుకుంటారా? లేక పంచాయతీ యూనిట్‌‌గా రుణం తీసుకుంటారా? స్పష్టత రావాల్సి ఉంది. పంచాయతీ పేరుతో ట్రాక్టర్లను రిజిస్టర్‌‌ చేస్తారని తెలుస్తోంది.రాష్ట్రంలో 8 వేల పంచాయతీలుండగా 500 జనాభా దాటిన 4,380 తండాలు, గ్రామాలను పంచాయతీలుగా ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసింది. కానీ పంచాయతీలకు తగ్గట్టు కార్మికుల సంఖ్య పెరగలేదు.పంచాయతీ రాజ్ కొత్త చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి పల్లెల రూపురేఖలను మార్చాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఈ దిశలో గ్రామగ్రామంలో పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇందుకు సంబంధించి చట్టంలో పటిష్ట నిబంధనలను పొందుపరిచిన విషయం తెలిసిందే. ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు చట్టానికి అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు 85% తక్కువగా బతికితే సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునే వెసులుబాటును ప్రభుత్వానికి కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పిస్తోంది. అటు విద్య, వైద్యం, తాగునీరు లాంటి కీలకమైన అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్న నేపథ్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై పంచాయతీలు ఎక్కువ దృష్టి సారించాలనేది ముఖ్యమంత్రి  కేసీఆర్ అభిప్రాయం. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ఖరారు చేశారు. త్వరలోనే అది అమల్లోకి రానుంది. దాంట్లో భాగంగా గ్రామాల్లో పవర్ వీక్, హరితహారం కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ కోసం స్థలాన్ని సేకరించాలని సీఎం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. చెత్తా చెదారం కనిపించకుండా ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని, మురికి కాల్వలన్నింటినీ శుభ్రం చేయాలని కూడా ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హరితహారంలో భాగంగా గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు ప్రజాప్రతినిధులు, అధికారులే బాధ్యత తీసుకోవాలనే అంశం కూడా విస్పష్టం.ఐతే ఓవైపు పారిశుధ్య నిర్వహణ, మరోవైపు హరితహారం మొక్కల పెంపకం, సంరక్షణ, నీటి సరఫరా, ఇతర గ్రామ అవసరాల నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి రవాణా సౌకర్యం కల్పించాలనేది ముఖ్యమంత్రి భావన. ఆ దిశలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వాలని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. జనాభా ప్రాతిపదికన, ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ లేదా మినీ ట్రాక్టర్ ఇవ్వాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ట్రాక్టర్, ట్రాలీతో పాటు గ్రామానికి ఒక నీళ్ల ట్యాంకర్ ను కూడా సమకూరిస్తే ప్రజల అవసరాలను మరింత సమర్థవంతంగా తీర్చ వచ్చనేది సీఎం కేసీఆర్ ఉదేశ్యం. సొంత రవాణా వ్యవస్థ ఉంటే పారిశుధ్యం నిర్వహణ, పచ్చదనంతో పాటు ఇతర సందర్భాల్లో వాహనాలను అద్దెకు తీసుకుని దుస్థితి పంచాయతీలకు తప్పుతుందని ఆయన భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి 500 జనాభాకు ఓ కార్మికుడు ఉండాలని సీఎం పలు సార్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టు కార్మికులను నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య 13 వేల మందిని నియమించాలని ప్రభుత్వానికి పంచాయతీ రాజ్‌‌ శాఖ ప్రతిపాదనలు పంపింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.