కొల్లేరు చేపల కరువు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొల్లేరు చేపల కరువు

ఏలూరు, ఆగస్టు 25, (way2newstv.com)
కొల్లేరు ప్రాంత చేపల రైతుల కొంప కొల్లేరయ్యింది.. ఎడతెగని వర్షాలకు వాగులు డ్రెయిన్లు ఉగ్రరూపం దాల్చడంతో వచ్చిపడుతున్న వరద నీరు చేపల చెరువుల పాలిట ఆశనిపాతంగా మారింది. నీటి ఉద్ధృతికి గట్లు తెగిపోతుండటంతో చెరువుల్లో ఉన్న మత్స్య సంపదను కాపాడుకోలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీ వర్షాలకు పై నుండి వస్తున్న వరద నీరు చేపల రైతులను నిలువెల్లా ముంచెత్తింది. 13 ఏళ్ల క్రితం ఇదే తరహాలో వచ్చిన వరదలకు కొల్లేటి ప్రాంత చేపల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు దాదాపుగా వర్షపునీటితో నిండిపోతున్నాయి. 
కొల్లేరు చేపల కరువు

బుడమేరు, తమ్మిలేరుకు ఉద్ధృతంగా వస్తున్న వరద కారణంగా ఆ నీరంతా కొల్లేరు సరస్సులో చేరుతోంది. అయితే సరస్సు పరిమాణం కుచించుకుపోవడం, అన్నీ చేపల చెరువులుగా మారిపోవడంతో ఆ నీరంతా చెరువుల్లోకి చేరిపోతోంది. దీనితో దాదాపు చెరువులన్నీ నిండు కుండల్లా గట్లను తాకుతూ ప్రవహిస్తున్నాయి. చెరువుల నుండి చేపలు బయటకు వెళ్లిపోకుండా గట్ల చుట్టూ వలలు ఏర్పాటుచేసి రైతులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయితే వరద ఉద్ధృతి అంతకంతకు పెరిగిపోతుండటంతో పలు చెరువుల గట్లు తెగిపోతున్నాయి. ఫలితంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేటి ప్రాంతంలో సాగుచేస్తున్న వేలాది ఎకరాల చెరువుల్లోని మత్స్యసంపద నీటిపాలవుతోంది. అయితే వరద ఉద్ధృతి తగ్గితే గానీ నష్టం ఎంతమేర ఉంటుందనేది చెప్పలేమన్నారు.గట్లు తెగిన చెరువుల నుండి చేపలు నేరుగా ఉప్పుటేరులోకి వస్తున్నాయి. దీంతో దుంపగడప శివారు పల్లెపాలెం, కృష్ణాజిల్లా పరిధిలోని జంగంపాడుకు చెందిన మత్స్యకారులు పెద్దఎత్తున వీటిని వేటాడే ప్రయత్నంలో తలమునకలవుతున్నారు. తాటి దోనెలపై వలలతో వేటాడుతున్నారు. బుధవారం నుంచి ఇదే తరహాలో చేపలు పడుతున్నప్పటికీ, ఒక్కరోజే దాదాపుగా నాలుగు టన్నుల మేర చేపలు దొరికినట్టు సమాచారం. ప్రస్తుతం చేపల ధర కేజీ రూ.110 పలుకుతోంది. అయితే మత్స్యకారులు పట్టిన చేపలను గురువారం ఉదయం వ్యాపారులు తొలుత కిలో రూ.70కి కొనుగోలు చేశారు. మత్స్యకారుల నుండి భారీగా చేపలు వస్తుండటంతో మధ్యాహ్నానికి వీటి ధర కిలో రూ.30కి పడిపోయింది. వీటిని కొనుగోలు చేసేందుకు చేపల వ్యాపారులు పల్లెపాలెం రేవు వద్ద ప్రత్యేక కాటాను ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి కొనుగోలు చేసిన చేపలను ఐషర్ వాహనాల ద్వారా ఆకివీడు చేపల మార్కెట్‌కు తరలిస్తున్నారు. 300సైజు నుండి కేజీన్నర వరకు చేపలు భారీగా వలల్లో పడ్డాయి. అయితే ఉప్పుటేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మత్స్యకారులు చాలా శ్రమిస్తున్నారు.