మందకొడిగా గృహ నిర్మాణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మందకొడిగా గృహ నిర్మాణం

గుంటూరు, ఆగస్టు 25, (way2newstv.com)
నిధుల కొరత, ఇతర కారణాల వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణం మందకొడిగా సాగుతోంది. గత మూడు సంవత్సరాలతో పోలిస్తే, ఈ ఏడాది ఎక్కువగానే నిర్మించినప్పటికీ, లక్ష్యాలను సాధించడంలో ఆశించిన మేర పురోగతి లేదు. పేదల సొంతింటి కలలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. 2019 నాటికి 19 లక్షల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను జోడించి పేదల సొంతింటి కల సాకారం చేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2019 నాటికి 19 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. 
మందకొడిగా గృహ నిర్మాణం 

కానీ గత నాలుగేళ్లల్లో గ్రామ, పట్టణ గృహ నిర్మాణాల పథకాల ద్వారా ఈ ఏడాది జూలై మాసాంతానికి 6,17,998 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ఇది లక్ష్యంలో 31 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ఎన్టీర్ పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం దాదాపు 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మించినప్పటీకీ, మరో సంవత్సర కాలంలో దాదాపు 12.5 లక్షల ఇళ్ళను నిర్మించడం కష్టసాధ్యంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, గృహ నిర్మాణానికి నిధుల కేటాయింపునకు ప్రాధాన్యత ఇస్తోంది. గృహ నిర్మాణానికి నిధుల విడుదల్లో జాప్యం ప్రభావం కూడా గృహ నిర్మాణంపై పడుతోంది. దాదాపు 600 కోట్ల రూపాయల మేర గృహ నిర్మాణ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఇటీవలే 269 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆధార్ కార్డు అనుసంధానంలో తలెత్తిన సమస్యల కారణంగా మరో 169 కోట్ల రూపాయల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని జోడించడంతో కేంద్రం నుంచి ఉపాధి హామీ బిల్లుల విడుదల్లో జాప్యం కూడా గృహ నిర్మాణంపై పడుతోంది. భారీ ఎత్తున గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చాలా జిల్లాల్లో జూలై నెలాఖరుకు కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాని పరిస్థితి నెలకొంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు కొలిక్కి రావడం లేదు. కొన్ని చోట్ల స్థలాల సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణంలో ఆశించిన వేగం లేని పరిస్థితి నెలకొంది.