కోతకు గురవుతునన్న గడిగెడ్డ జలాశయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోతకు గురవుతునన్న గడిగెడ్డ జలాశయం

విజయనగరం, ఆగస్టు 19, (way2newstv.com)
విజయనగరం జిల్లాలోని గడిగెడ్డ జలాశయం నుంచి కాలువలకు నీటి విడుదలకు పాత షట్టర్లే గతి అవుతున్నాయి. గడిగెడ్డ జలాశయం గట్టు కోతకు గురవుతోంది. ఒకప్పుడు విశాలంగా ఉండే గట్టు రానురాను వర్షపునీటికి కరిగి జారిపోతోంది. మదుముల వద్ద కోరివేత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. గడిగెడ్డ జలాశయం నుంచి విజయనగరానికి ఒక టీఎంసీ నీటిని సరఫరా చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీని గట్టు ఎత్తు చేసి నీటినిల్వ పెంచడం ద్వారా ఇక్కడ నుంచి 10 ఎం.ఎల్‌.డి (మిలియన్‌ లీటర్స్‌ డే) జిల్లాకేంద్రానికి మళ్లించే అవకాశం ఉంటుంది.
 కోతకు గురవుతునన్న గడిగెడ్డ జలాశయం

గతంలో రిజర్వాయరులో పూడిక తీతకు  రూ.50 లక్షలు మంజూరైనా పనుల నిర్వహణకు గుత్తేదారులెవరూ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి. అప్పట్లో పూడిక తీసి ఉంటే జలాశయం లోతు పెరిగి మరింత నీటి నిల్వకు అవకాశం ఉండేది.తలుపులు చాలాకాలంగా సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతున్న వాటితోనే నెట్టుకొస్తున్నారు.  గుర్ల మండలంలో సాగునీటికి ఏకైక వనరు గడిగెడ్డ జలాశయం. 1968లో పకీరుకిత్తలి, తాతావారికిత్తలి మధ్య గడిగెడ్డపై దీన్ని ఏర్పాటు చేశారు. దీని కింద కుడి ఎడమ కాలువ ద్వారా 2900 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. గతంలో రూ.17 కోట్ల వ్యయంతో జలాశయం అభివృద్ధి పనులు చేపట్టారు. కుడి, ఎడమ కాలువలు సిమెంటు లైనింగు నిర్మించారు. గతంలో కాలువల్లో సక్రమంగా నీరు పారక శివారు ఆయకట్టుకు అందేది కాదు. కాలువలకు సీసీ లైనింగు ఏర్పాటు చేశాక పూర్తి ఆయకట్టుకు నీరు చేరుతుంది. దీనికితోడు ఈ జలాశయానికి తోటపల్లి  జలాలు చేరేలా అనుసంధానం చేశారు. ఇంత చేసినా ఇక్కడున్న పాత షట్టర్లు మాత్రం మార్పుచేయలేదు. దీంతో కాలువలకు నీరు వదిలేటప్పుడు కుస్తీ పట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.