దారి మళ్లుతున్న హెచ్ఎండీఎ మొక్కలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దారి మళ్లుతున్న హెచ్ఎండీఎ మొక్కలు

రంగారెడ్డి, ఆగస్టు 17 (way2newstv.com)
మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచాలని ప్రభుత్వం యోచిస్తుంటే హరితహారంలో దళారులు చొరబడి ప్రభుత్వానికి భారీ నష్టం చేకూరుస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సరీలు నిర్వహిస్తుండగా ప్రయివేటు వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉచితంగా మొక్కలు పొందుతున్నారు. వాటిని అధిక ధరలకు మార్కెట్‌లో విక్రయిస్తూ వేలకువేలు దండుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ చేరాల్సిన మొక్కలను కొందరు మాత్రమే సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది 7 కోట్ల మొక్కలను నాటాలని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 
దారి మళ్లుతున్న హెచ్ఎండీఎ మొక్కలు

వాటిలో దాదాపు రూ.28కోట్ల వ్యయంతో 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 3.8 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏడు నెలల్లో 32లక్షల వరకు మొక్కలను పంపిణీ చేశారు. ఇదిలావుండగా హెచ్‌ఎండీఏ చేపట్టిన మొక్కల పంపిణీ పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 28 కోట్లు ఖర్చు చేసి హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాలో మొక్కలను నాటేందుకు ఒకపక్క అధికారులు కసరత్తు చేస్తుండగా.. అవి ప్రయివేటు నర్సరీలకు తరలివెళ్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు పెంచిన దాదాపు 150కిపైగా వివిధ రకాల మొక్కలను రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌, ఓఆర్‌ఆర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలు, కాలనీలు, పురపాలక ప్రాంతాల్లో నాటేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఉచిత పంపిణీకి చర్యలు చేపట్టిన అధికారులు నేరుగా నర్సరీల వద్ద నుంచి ఎవరైనా 50 మొక్కల వరకు తీసుకెళ్లే విధంగా వెసులుబాటు కల్పించారు. హెచ్‌ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లకుండా నర్సరీల వద్దే ఓ ఫామ్‌ నింపి ఆ మొక్కలను తీసుకెళ్లొచ్చు. ఇలా 100పైగా కావాలంటే ఆధార్‌ లేదా గుర్తింపు కార్డులను చూపించి తీసుకెళ్లాల్సి ఉంది. 2 వేల మొక్కలు కావాల్సిన వారికి రవాణాతో కలిపి ఉచితంగా ఇంటివరకు పంపిణీ చేస్తోంది. ఆ స్థాయిలో కావాలనుకునేవారు (అర్బన్‌ ఫారెస్టు వెబ్‌సైట్‌) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కాలనీవాసులైతే లెటర్‌ప్యాడ్‌లు, ఇతర సంస్థలైతే వాటి వివరాలను పొందపర్చాలి. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా దాదాపు 85 సంస్థలు రెండు వేలకుపైగా మొక్కలు కావాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్టు సమాచారం. అలా 32లక్షల వరకు పంపిణీ జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా కొందరు ప్రయివేటు నర్సరీ నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉచితంగా మొక్కలను పొందుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో మొక్కను రూ. 25 నుంచి రూ. 100 వరకు విక్రయించి దండుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించగా తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. అక్రమాలకు పాల్పడితే సమాచారం అందించాలని సూచించారు.