హై ద్రాబాద్, ఆగస్టు 17, (way2newstv.com)
జీహెచ్‌ఎంసీలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్‌ఎఫ్‌ఏ) పరస్పర బదిలీలు దందాగా మారుతున్నాయి. బల్దియా బాస్ ఓరల్‌గా చెప్పిన మాటలను క్షేత్రస్థాయి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ బదిలీల్లో చేతివాటం ప్రదర్శించే అధికారులు, ఎస్‌ఎఫ్‌ఏల పరస్పర అవగాహనతో జరిగే బదిలీలూ అసెస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు వరంగా మారుతున్నాయి. జోనల్ స్థాయిలో చేపడుతున్న ఈ తతంగంలో ఆ రెండు సర్కిళ్ల అధికారులకు చేతులు తడపాల్సి వస్తోందని పలువురు ఎస్‌ఎఫ్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి జోన్లలో బదిలీల దందా సాగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హైద్రాబాద్ లో ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీల ప్రహసనం
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో సుమారు 18 వేల పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి ఏడుగురు కలిసి గ్రూపుగా నగరంలోని పలుప్రాంతాల రహదారులను శుభ్రం చేయడం, చెత్త నిల్వలు లేకుండా పనిచేస్తున్నారు. వారికి ప్రతి రెండు లేదా మూడు గ్రూపులకు కలిపి ఒక శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ) సూపర్‌వైజింగ్ విధులు నిర్వహిస్తుంటారు. నగరవ్యాప్తంగా సుమారు 955 ఎస్‌ఎఫ్‌ఏలు పనిచేస్తుండగా గతేడాది క్రితం జీహెచ్‌ఎంసీ నిర్ణయంతో వీరందరినీ నగరంలోని వివిధ ప్రాంతాలకు బదిలీలు చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా బదిలీ చేస్తారా అని ఆ సందర్భంలో ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయినా సంస్థ ఆదేశాలు పాటించాల్సి రావడంతో బదిలీలు తప్పనిసరిగా మారాయి. దీంతో కొత్త స్థానాల్లో విధులకు హజరయ్యేందుకు ఒక్కో ఎస్‌ఎఫ్‌ఏ నగరంలో తరుచూ ట్రాఫిక్ సమస్యలతో కొన్ని కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తున్నదంటూ కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు.అవినీతికి ఆస్కారం ఉండే విభాగాలలో పారిశుధ్య విభాగం ఒకటి. ఎస్‌ఎఫ్‌ఏ నియామకం, పారిశుధ్య కార్మికుల నియామకం, సిబ్బంది హాజరు విషయంలో గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో మాన్యువల్ రిజిస్టర్ స్థానంలో బయోమెట్రిక్ హజరును నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ తర్వాత అవినీతి తగ్గినప్పటికీ.. విధులకు గైర్హాజరయ్యే కార్మికుల బయోమెట్రిక్‌ను ప్రత్యేకంగా తీసుకుంటున్నట్టు సమాచారం. గైర్హాజరుకు బయోమెట్రిక్ తీసుకుంటున్న రోజులకు వచ్చే దినసరి వేతనాలను ఎస్‌ఎఫ్‌ఏలు ఒక దగ్గర జమ చేసి, స్థానిక ఏఎంఓహెచ్‌లకు అందజేస్తున్నట్టు విమర్శలు సైతం ఉన్నాయి. వాటిలో కొంత వాటా పొందుతున్న ఎస్‌ఎఫ్‌ఏలు తమకు కావాల్సిన ప్రాంతానికి పరస్పర బదిలీకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా ఏఎంఓహెచ్‌లు ఈ బదిలీలకు వేలాది రూపాయలు దండుకుంటున్నట్టు తెలిసింది. బదిలీల్లో 30-40 కిలోమీటర్ల నుంచి విధులకు హాజరవుతున్న వారినుద్దేశించి పరస్పర అంగీకారం (మ్యూచువల్)తో బదిలీలు చేయండని కమిషనర్ ఓరల్‌గా అధికారులకు సూచించారు. దీంతో కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని దందా కొనసాగిస్తున్నారు.
Tags:
telangananews