రైతులను ముంచేస్తున్న దళారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులను ముంచేస్తున్న దళారులు

అనంతపురం, ఆగస్టు 19, (way2newstv.com)
అనంతపురం చీనీ  రైతుల కష్టాలు  తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో చీనీ కాయలు రోజూ 1,000 టన్నుల వరకు వ్యాపారం సాగుతోంది. అనంతపురం మార్కెట్‌యార్డు, తోటల వద్ద వ్యాపారులు, దళారులు కొనుగోలు చేస్తున్నారు. తరుగు, కమీషన్‌ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులు ఎంత మొత్తుకున్నా వ్యాపారుల తీరు మారలేదు. రెండు సూట్లతో పాటు రెండున్నర రెట్లు కమీషన్‌ అధికంగా దోచేస్తున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలంపై ఎంపీ జేసీ ముఖ్యమంత్రికి గతంలో ఫిర్యాదు చేయగా కఠినంగా వ్యవహరించాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. ఈక్రమంలో రెవెన్యూ, ఉద్యాన, మార్కెటింగ్‌ అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేసినా.. అప్పట్లో కొంత కట్టడి అయింది. తాజాగా పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు పేట్రేగుతున్నారు.
రైతులను ముంచేస్తున్న దళారులు

మార్కెటింగ్‌, ఉద్యాన, రెవెన్యూ శాఖలతో కమిటీ వేశారు. వీరంతా గతంలో అనంతపురం మార్కెట్‌ యార్డులో తనిఖీ చేసి వ్యాపారుల దందా బయట పెట్టారు. నిబంధనల ప్రకారం 4 శాతమే కమీషన్‌ తీసుకోవాలని కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులను హెచ్చరించారు. అప్పట్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా.. మళ్లీ పర్యవేక్షణ పడకేసి కథ మొదటికి వచ్చింది. కాయలు ఏడాదికి రెండు సీజన్లలో వస్తాయి. అనంతపురం మార్కెట్‌ యార్డులో మార్కెట్‌ సౌకర్యం కల్పించారు. వందలాది టన్నుల కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. తోటల వద్ద కూడా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. సీజన్‌లో చీనీకాయలు రోజుకు 1,000 టన్నుల వరకు వ్యాపారం సాగుతోంది. కానీ ఇంకా పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. అసలు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించినా లెక్క చేయడంలేదు. 10 టన్నుల చీనీకాయలు కొనుగోలు చేస్తే.. తరుగు పేరుతో ఏకంగా రెండు టన్నుల కాయలు వ్యాపారులు నొక్కేస్తున్నారు. అదేంటని అడిగితే తరుగు ఇస్తేనే కొంటామని మరీ వ్యాపారులు బెదిరిస్తున్నారు.10 శాతం ఇవ్వాల్సిందే...:  కమీషన్‌ నిబంధన ప్రకారం 4 శాతం తీసుకోవాలి. అయితే నిర్దాక్షిణ్యంగా 10 శాతం వసూలు చేస్తున్నారు. రూ.లక్ష కాయలు అమ్ముకుంటే రూ.10 వేలు పట్టుకుని మిగిలిన సొమ్ము రైతుకు ఇస్తున్నారు. ఏటా రైతు నుంచి వ్యాపారులు కమీషన్‌, తరుగు దోపిడీ ఎంతంటే.. రూ.కోట్లలో మాటే. అధికారులు నిబంధనలు పెట్టి కేసులు నమోదు చేస్తామని చెప్పినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది.అనంతపురం మార్కెట్‌ చీనీ సంతలోనూ, తోటల వద్ద వ్యాపారానికి తేడా లేదు. 10 టన్నులకు రెండు టన్నులు (రెండు సూట్లు) తరుగు ఇవ్వాల్సిందే. లేదన్నా వ్యాపారులు వినరు. కమీషన్‌ చెప్పాల్సిన అవసరం లేదు. రైతుకిచ్చే సొమ్ములోనే రూ.లక్షకు రూ.10 వేలు కమీషన్‌ పట్టుకుని ఇస్తారు. అధికారులే కాదు.. ముఖ్యమంత్రి చెప్పినా వ్యాపారుల తీరు మారదు. కమీషన్‌, తరుగు కట్టడి చేస్తేనే రైతు బాగుపడేదని రైతులు వాపోతున్నారు.