అనంతపురంలో స్కూళ్లకు కష్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతపురంలో స్కూళ్లకు కష్టాలు

అనంతపురం, ఆగస్టు 16, (way2newstv.com)
చేతిలో సొమ్ములేక విద్యాశాఖ దిక్కుతోచని స్థితిలో ఉంది. పాఠశాల యాజమాన్య కమిటీల  ఖాతాల్లోని సొమ్ముంతా వెనక్కి తీసుకున్నారు. కనీసం సుద్దముక్క కూడా కొనలేని దుస్థితి. జిల్లాలో 357 స్కూల్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలల్లో నెలకు ఒకటి, రెండు చొప్పున సమావేశాలు నిర్వహించాలి. బోధన, విద్యార్థులకు చేపట్టే కార్యక్రమాలపై సమీక్షించాలి. సమావేశాల నిర్వహణకు ఒక్కో పాఠశాలకు రూ.22 వేలు చొప్పున మొత్తం రూ.89 లక్షలు విడుదల చేశారు. కొందరు ప్రధానోపాధ్యాయులు సమావేశాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారు. ఇంకొందరు సమావేశాలు ఏర్పాటు చేసినా.. పూర్తి స్థాయిలో బిల్లులు పెట్టలేదు. ప్రస్తుతం ఆ నిధులు వెనక్కి వెళ్లాయి. దీంతో సమావేశాల నిర్వహణ అటకెక్కింది.
 అనంతపురంలో  స్కూళ్లకు కష్టాలు

ఓవైపు ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం.. మరోవైపు యంత్రాంగం అసమర్థతే ఇందుకు కారణం. గత 20 రోజులుగా పాఠశాల ఖాతాలన్నీ శూన్యమయ్యాయి. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26 అంశాల ప్రాతిపదికన ఆయా పద్దుల్లో నిధులు జమ చేశారు. అందులో ఒక్క పైసా తీసుకోవాలన్నా ఎస్‌ఎంసీ ఆమోదం తప్పనిసరి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల కమిటీ ఛైర్మన్‌ సంతకంతోనే సొమ్ము డ్రా చేయాల్సిఉంది. ఇన్ని నిబంధనలు ఉన్నా.. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏ అధికారులు నిధులన్నీ వెనక్కి లాగేసుకున్నారు. పాఠశాలల్లో సుద్దముక్క, శుభ్రత, తెల్ల కాగితం, జిరాక్సు తదితర వాటికి కష్టమైపోయింది. అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరమ్మతు పనులు నిలిచిపోయాయి.సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులివ్వాలి. ఆలస్యంగా నిధులు జమ చేసి మమ అనిపించేసి, ఆ సొమ్మును లాగేసుకున్నారు. జిల్లాలో వివిధ పాఠశాలలకు విద్యార్థులు దూర ప్రాంతం నుంచి నడిచి వస్తున్నారు. 894 మంది విద్యార్థులు నడిచి వస్తున్నట్లు గుర్తించారు. వీరికి రవాణా భత్యానికి రూ.10.41 లక్షలు ఆయా ఖాతాల్లో గత ఏప్రిల్‌లో జమ చేశారు. అక్కడి నుంచి విద్యార్థి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. దీనిపై స్పష్టమైన విధివిధానాలు రాలేదు. అలాగే విద్యాసంవత్సరం చివరలో నిధులు రావడంతో విద్యార్థులకు ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఖాతాల్లో నిల్వ ఉన్న ఆ సొమ్మును వెనక్కి తీసుకున్నారు.మరుగుదొడ్లను నిత్యం శుభ్రం చేయాల్సిందే. వీటి నిర్వహణకు ఏప్రిల్‌లో నిధులు కేటాయించారు. స్వచ్ఛయాక్షన్‌ కింద 3206 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.32.06 లక్షలు కేటాయించారు. ఈ నిధులను కూడా వెనక్కి తీసుకున్నారు. దీంతో మరుగుదొడ్ల నిర్వహణ అటకెక్కింది. విద్యార్థులు మరుగుదొడ్ల వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.వంట గదుల నిర్మాణాలకు ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షలు మంజూరైంది. పలుచోట్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంకా బిల్లులు మంజూరు చేయలేదు. 492 గదుల నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేశారు. ఆ సొమ్మును వెనక్కి తీసుకోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఇప్పటివరకు జరిగిన పనులకు రూ.4 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.