అనంతలో కబేళాలకు తరలిపోతున్న పశువులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతలో కబేళాలకు తరలిపోతున్న పశువులు

అనంతపురం,  ఆగస్టు 22,(way2newstv.com)
అనంతపురం జిల్లాలో పాడిపశువులు, గొర్రెల పెంపకం వంటి చోట్ల అత్యధికంగా ఉన్నాయి. అయితే వరుస కరువుల ప్రభావం పశుపోషణపైనా తీవ్రంగా పడుతూ ఉంటుంది. గ్రాసం ప్రధాన సమస్యగా మారుతూ ఉంటోంది. దీంతో సమయంలో పోషించలేక కబేళాలకు అమ్మేసుకుంటున్నారు.  అయితే వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గ్రాసం నిలువలపై గత కొంతకాలంగా కొత్త ప్రయోగాలు చేస్తోంది. కొన్నింటిని ప్రయివేటు కంపెనీలకు అప్పగించి 'సైలేజ్‌' పద్దతుల్లో రైతులకు విక్రయించాలని చర్యలు చేపట్టింది. ఈ విధంగా జిల్లాలో ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బంకర్‌ పద్ధతుల్లో పశుగ్రాసం నిలువకు ఉత్తర్వులివ్వడంతోపాటు సబ్సిడీతో వాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. 
 అనంతలో కబేళాలకు  తరలిపోతున్న పశువులు

అందులో మొదటిది 25 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం నిలువ చేసే బంకర్‌, 50 మెట్రిక్‌ టన్నులు, వంద మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం నిలువచేసే బంకర్లను మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతులుగాని, రైతు సంఘాలు, ప్రయివేటు సంస్థలు ఎవరైనా ముందుకొచ్చి వీటిని నిర్మించుకోవచ్చు. దీనికి 25 శాతం లబ్ధిదారుని వాటా, 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుంది. 25 మెట్రిక్‌ టన్నుల బంకర్‌ నిర్మాణానికి రూ.75 వేలు లబ్దిదారుని వాటా, రూ.2.25 లక్షలు సబ్సిడీ లభించనుంది. 50 మెట్రిక్‌ టన్నులకు అవుతే రూ.1.33 లక్షలు లబ్ధిదారుని వాటా, రూ.4.01 లక్షలు సబ్సిడీ, వంద మెట్రిక్‌ టన్నుల నిలువ సామర్థమున్న బంకర్‌ నిర్మాణానికి రూ.2.51 లక్షలు లబ్ధిదారుని వాటాకాగా, రూ.7.54 లక్షలు సబ్సిడీ లభించనుంది. ఈ విధంగా మూడు రకాలుగా సైలో బంకర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్మాణానికి ఇచ్చే సబ్సిడీ కూడా నిర్మాణాన్ని బట్టి మూడు దశల్లో నిధులు మంజూరు చేస్తారు. ప్రభుత్వం పశుగ్రాసం నిలువ ఉంచుకోవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం బాగున్నప్పటికీ లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సిందే చాలా ఉండటం ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే 25 మెట్రిక్‌ టన్నుల నిలువ చేసే బంకర్‌ నిర్మించుకోవాలన్నా రూ.75 వేల వరకు రైతు భరించాల్సి ఉంటుంది. అలా కాకుండా సబ్సిడీని పెంచితే సామాన్య రైతులు కూడా దీని నిర్మాణానికి ముందుకొచ్చేందుకు వీలుంటుంది. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండే అనంతపురం జిల్లా వంటి చోట్ల 'సైలో' పద్దతిలో పశుగ్రాసం నిలువ ఉంచుకోవడం ప్రయోజనకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వృధాకాకుండా జాగ్రత్తగా నిలువ ఉంచుకుని పాడి పశువులకు వినియోగించుకోవడం వలన పాల దిగుబడి తగ్గకుండా చూసుకునేందుకు వీలుంటుందన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పద్దతిని మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపడితే ప్రయోజనకరమన్న రైతులు వాపోతున్నారు.