భారీగా తగ్గిన పత్తి సాగు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారీగా తగ్గిన పత్తి సాగు...

రెట్టింపైన క్యాండిల్ ధర
గుంటూరు, ఆగస్టు22,(way2newstv.com)
పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంటకు గులాబీ రంగు పురుగు ఆశించడం, అపరాలపై రైతులు దృష్టి పెట్టటం వంటి కారణాలతో సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 25శాతం మేర పంటసాగు విస్తీర్ణం తగ్గింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 17 లక్షల హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేస్తుంటారు. ఈ ఏడాది సుమారు 12.50 లక్షల హెక్టార్లలో మాత్రమే రెండు రాష్ట్రాల్లో పత్తి సాగైందని, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగియనుండటంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోనే పత్తి అత్యధికంగా సాగు చేసే గుంటూరు జిల్లాలో సైతం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత ఏడాది 2 లక్షల హెక్టార్లలో రైతులు సాగుచేయగా ఈ ఏడాది 1.26 లక్షల హెక్టర్లలో మాత్రమే పత్తి వేశారు. 
భారీగా తగ్గిన పత్తి సాగు... 

2015-16 సీజన్‌కు గాను తెలంగాణ, ఆంధ్రాలో 80 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. కేంద్ర జౌళి శాఖ వెనకాముందు చూసుకోకుండా ఎగుమతులకు అనుమతి ఇవ్వడంతో దేశీయంగా దూది నిల్వలు అడుగంటాయి. 2015-16 సంవత్సరానికి గాను పంట ఉత్పత్తిలో 75 లక్షల బేళ్ల ఎగుమతికి ఆదేశాలు ఇవ్వడంతో దేశీయ అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాండిల్  ధర రూ.35 వేల నుండి 55 వేల రూపాయలకు చేరుకుని చిన్న, సన్నకారు స్పిన్నింగ్ పరిశ్రమలన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయ.కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అంతర్జాతీయ కంపెనీలతో లోపాయికారీ ఒప్పందాల వల్లనే దేశీయంగా స్పిన్నింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఎపి కాటన్ అసోసియేషన్, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పున్నయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేదిగా జౌళి రంగానికి పేరుందని, ఈ రంగం గత ఏడాది 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చిందని  తెలిపారు. ఎగుమతుల ద్వారా 45 బిలియన్ డాలర్లు, దేశీయ అవసరాలకు వినియోగించడం ద్వారా మరో 35 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం క్యాండిల్‌కు ఒక్కసారిగా 20 వేల రూపాయలు ధర పెరగడంతో చిన్న మిల్లుల యాజమాన్యాలు చితికిపోవడంతో పాటు స్పిన్నింగ్ మిల్లులన్నీ మూతపడే స్థితికి వచ్చాయన్నారు.