విశాఖపట్టణం, సెప్టెంబర్ 28, (way2newstv.com)
ఈ ఏడాది తగినంత వర్షపాతం ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, భూగర్భ నీటిమట్టాలు పడిపోయాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన దయో తుపాను కూడా ఉత్తరాంధ్రలో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. దీంతో జివిఎంసికి నీటిని అందించే జలాశయాలు వెలవెలబోతున్నాయి. అక్టోబరు 10 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. ఉత్తర భారతదేశం, కేరళను కుదిపేసిన నైరుతి ఈ ఏడాది ఎపిని తీవ్రంగా నిరాశపరిచింది. తిరుగు పయనంలో కూడా నైరుతి వర్షిస్తుందన్న నమ్మకం సన్నగిల్లింది. బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడితే తప్ప తర్వాత వచ్చే ఈశాన్యం దక్షిణ కోస్తా, తమిళనాడుకే పరిమితం.
మరో 10 రోజుల్లో నిష్క్రమించనున్న నైరుతి
దీంతో విశాఖలో తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పరిశ్రమలదీ ఇదే పరిస్థితి. ఉన్న వాటికి, కొత్త వాటికి ఎక్కడ నుంచి నీరు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటినిల్వలు డిసెంబరు వరకు నీటిని అందించగలవు. జనవరి నుంచి ఎండలు మొదలైతే నీటికష్టాలు మొదలవుతాయని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి కొరత కారణంగా విశాఖ నగరంలో తాగునీటి సరఫరా కుదించారు. సాధారణంగా ప్రతి రోజూ 80 ఎంజిడిల నీటిని నగర ప్రజలు, పరిశ్రమల్లో తాగునీటి అవసరాలకోసం సరఫరా చేసేవారు. అలాంటిది 50 నుంచి 60 ఎంజిడిలకు పడిపోయింది. ఇందులో 16 ఎంజిడి పరిశ్రమల్లో తాగునీటికి పోగా మిగిలిన 44 ఎంజిడిలే నగర ప్రజలకు ఇస్తున్నారు. వర్షాకాలంలోనే ఇలా ఉంటే వేసవి మొదలైతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే తాగునీరు సరఫరా తగ్గిపోవడంతో నగరంలోని 9 వేల బోరు బావులు, చేతి బోర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. వేసవిలో భూగర్భ నీటి మట్టాలు పడిపోతే వాటిల్లో కూడా నీరు లభించే అవకాశం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు జలాశయం నీటి మట్టం ఆశాజనకంగా ఉంది. ఉత్తరాంధ్రతో పోలిస్తే గోదావరి బేసిన్‌లో కొంతమేర వర్షాలు కురవడంతో 86 మీటర్ల నీటి మట్టానికి 84 మీటర్ల నీటి నిల్వ ఉంది. రోజూ దీని నుంచి 30 ఎంజిడి నీరు జివిఎంసికి విడుదల చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాది చివరి వరకు సరిపోతుందని వాటర్ సప్లై ఎస్‌ఇ కె.పల్లంరాజు చెబుతున్నారు. ఏలేరు నీటి నిల్వలు పడిపోతే గోదావరి నుంచి పంపులతో ఎత్తిపోయడమే మార్గమన్నారు.