బాబుకు కలిసిరాని పర్యటనలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబుకు కలిసిరాని పర్యటనలు

కాకినాడ, సెప్టెంబర్ 27, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు జిల్లాల పర్యటనలు అచ్చిరావడం లేదా? ఆయన జిల్లా పర్యటనలకు బయలుదేరే ముందు, తర్వాత నేతలు వరసగా పార్టీని వదిలి వెళుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలు డీలా పడిపోయారు. ప్రజల ముందుకు వచ్చేందుకు కూడా వారు ఇష్టపడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని కొందరు, ఇక పార్టీకి భవిష్యత్తు లేదని మరికొందరు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు.చంద్రబాబు కూడా వెళ్లిపోయే వారి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. అధికారం చేజారిపోయిన వెంటనే ఇవన్నీ కామన్ అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. 
బాబుకు కలిసిరాని పర్యటనలు

ఎన్నికల సమయానికి తన చుట్టూ చేరతారన్న విశ్వాసంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే వెళ్లిపోతానంటున్న నేతలను సయితం ఆయన బుజ్జగించడంలేదు. పిలిచి మాట్లాడటం లేదు. దీంతో్ అనేక మందినేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోగా, మరికొందరు లగేజీ సర్దేసుకుని రెడీగా ఉన్నారు. నేతలు వెళ్లినా 40 శాతం ఓటు బ్యాంకు పార్టీకి ఉందని చెబుతున్న చంద్రబాబు క్యాడర్ లో ధైర్యం నూరిపోసేందుకు జిల్లాల పర్యటన చేపట్టారు.ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లి 19 నియోజకవర్గాల సమీక్షలను చంద్రబాబు చేశారు. అయితే రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమావేశానికి డుమ్మా కొట్టారు. చంద్రబాబు రెండు సార్లు ఫోన్ చేసినా వస్తానని చెప్పి ఆయన గైర్హాజరయ్యారు. దీనికి ముందే టీడీపీ నేత వరుపుల రాజా పార్టీని వదిలి వెళ్లిపోయారు. తూర్పు గోదావరి జిల్లా చంద్రబాబు సమీక్షల తర్వాత తోట త్రిమూర్తులు తన అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక చంద్రబాబు వచ్చే నెల 10వ తేదీన విశాఖ జిల్లా పర్యటనకు వెళుతున్నారు.విశాఖ లోనే రెండు రోజుల పాటు ఉండనున్న చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు కీలక నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్న చర్చ పార్టీలో జరుగుతుంది. తోట త్రిమూర్తులు బాటలోనే గంటా శ్రీనివాసరావు కూడా పార్టీని వీడతారా? అన్న అనుమానం టీడీపీ నేతలకు ఉందనడంలో ఎటువంటి సందేహంలేదు. ఆయన నియోజకవర్గానికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గంటా వెళ్లిపోతే చంద్రబాబుకు జిల్లా సమీక్షలు అచ్చిరావడం లేదనే చెప్పాలి. అదే సెంటిమెంట్ గా మారే అవకాశముందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.