( శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం)
భక్తితో దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన బుద్ధిశాలి ఆంజనేయుడు తిరుమల క్షేత్రంలో వెలసి బేడీ ఆంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు. భక్తిలోని నిగూఢార్థాన్ని భక్తలోకానికి తెలియజెప్పే తిరుమలలోని శ్రీబేడీ ఆంజనేయస్వామి ఆలయ విశేషాలు ఇలా ఉన్నాయి. హనుమంతుడిని తల్లి అంజనాదేవి బేడీలతో బంధించిన గుడి ఎక్కడ ఉందో తెలుసా. ఎందుకు అక్కడ ఆ స్వామివారు బేడీలతో దర్శనమిస్తారు. అసలు ఆయన ఏం చేశాడు. త్రేతాయుగంలో రామచంద్రుడి సేవలో తరించిన ఆంజనేయుడు. కలియుగ దైవం చెంత పూజలందుకుంటున్న ప్రదేశం ఏది. ఇత్యాది ఆసక్తికర విషయాలకు సమాధానమే తిరుమలలోని శ్రీబేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం.ఆనందనిలయానికి అభిముఖంగా కొలువుదీరిన పవనసుతుడి మందిరమే బేడీ ఆంజనేయస్వామి ఆలయం.
శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం
తిరుమల సన్నిధి వీధిలో శ్రీవారికి అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు, కాళ్ళకు బేడీలు ధరించి శ్రీ ఆంజనేయస్వామివారు దర్శనమిస్తారు. అంజనాద్రి పర్వతంపై అల్లరి చేస్తున్న హనుమంతుడిని తల్లి అంజనాదేవి మందలించి కాళ్ళకు, చేతులకు బేడీలువేసి శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట. అందుకే ఇక్కడ స్వామిని బేడీ ఆంజనేయునిగా పిలుస్తారని ఐతిహ్యం. ఆంజనేయస్వామి ఆలయం, ముఖమండపం, గర్భాలయం అనే రెండు భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో స్వామివారి ఆరడుగుల నిలువెత్తు గంభీరమూర్తి ఐహిక వాంఛలను తృణప్రాయంగా వదిలేసి భక్తి తత్వానికి బంధీ అయితే దేవదేవుడి కృప మనమై నిండుగా ఉంటుందనే పరమార్థాన్ని ప్రబోధిస్తుంటుంది. ఆ స్వామి దర్శనం భక్తులకు అభయప్రదాయకం. ఏకశిలా గోపురంతో ఆకట్టుకునే బేడీ ఆంజనేయస్వామి సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేసే వీలుగా ప్రదక్షిణామండపాన్ని కూడా టిటిడి నిర్మించింది.ప్రతిరోజూ త్రికాల అర్చనల్లో భాగంగా ఆనందనిలయంలో శ్రీవారికి నివేదనల అనంతరం భక్తశిఖామణి అయిన శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. ఈ నివేదనలు శ్రీవారి ఆలయం నుంచే ఆంజనేయస్వామి సన్నిధికి వస్తాయి. ప్రతి నెలా పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ శ్రీబేడీ ఆంజనేయస్వామి సన్నిధికి చేరుకుంటారు. ఆ సమయంలో స్వామి, అమ్మవార్లకు కర్పూరహారతులు సమర్పించిన అర్చకులు ఆ శేషహారతిని దాసభక్తి పరాయణుడికి సమర్పించడం సంప్రదాయం. అనంతరం రాములవారి మెడలోని పూలహారాన్ని రామభక్తుడు హనుమంతుడికి అలంకరించి, నివేదనలు సమర్పిస్తారు. ఇక ప్రతి ఏటా శ్రీవారి బ్ర¬్మత్సవాలలో గరుడసేవ రోజున ప్రభుత్వం తరపున శ్రీవారికి సమర్పించే పట్టువస్త్రాలను బేడీ ఆంజనేయస్వామి సన్నిధి నుంచే ఊరేగింపుగా తీసుకువెళ్ళడం ఆనవాయితీ.