విశాఖపట్టణం, సెప్టెంబర్ 30, (way2newstv.com)
వంగలపూడి అనిత. 2014కు ముందు ఓ సాధారణ టీచరమ్మ. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో 2014లో చంద్రబాబు ఆమెను ప్రోత్సహించారు. టీడీపీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం టికెట్ కూడా ఇచ్చారు. అప్పటి చంద్రబాబు ఇమేజ్ తో వంగలపూడి అనిత గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, అత్యంత తక్కువ సమయంలోనే వంగలపూడి అనిత బ్యాడ్ నేమ్ సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో విజిటింగ్ గెస్ట్ మాదిరిగా ఆమె మారిపోయారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదే సమయంలో భర్తతో వివాదం మరింతగా ఆమె పరువును దిగజార్చింది.దీంతో పాయకరావుపేటలో సొంత పార్టీలోనే అసమ్మతి పెరిగిపోయింది.
రెండింటికి చెడ్డరేవడిలా అనిత
ఇక, వైసీపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ రోజాతో నిత్యం వివాదాలకు శ్రీకారం చుట్టడం, మీడియా ముందుకు రావడంతో నియోజకవర్గం సమస్యలు ఎక్కడివక్కడే అన్నట్టుగా మారిపోయాయి. పార్టీలో మహిళల పరంగా స్ట్రాంగ్‌గా వాయిస్ వినిపిస్తుండడంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా వంగలపూడి అనితను బాగా ఎంకరేజ్ చేశారు.ఇక 2017లో జరిగిన ప్రక్షాళనలో కేబినెట్‌లో ఛాన్స్ కోసం వంగలపూడి అనిత ఎన్నో ప్రయత్నాలు చేయడం గమనార్హం. అయితే, చంద్రబాబు ఆమెకు ఈ ఛాన్స్ ఇవ్వలేదు. ఇదిలావుంటే, 2019 ఎన్నికలకు వచ్చే సరికి వంగలపూడి అనితపై సేకరించిన అన్ని నివేదికల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేనని తేలిపోయింది. మరోపక్క, పశ్చిమగోదావరిలోని కొవ్వూరులో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రిపై అసంతృప్తి పెరిగిపోవడంతో ఆయనను అక్కడి నుంచి తప్పించారు.ఈ క్రమంలో కొవ్వూరులోని టీడీపీ నేతలను కాదని, మూడు జిల్లాలు మార్చుకుని వచ్చి.. వంగలపూడి అనితకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. అప్పటికే స్థానికత రగడ రాజుకోవడం, లోకల్‌లీ డర్‌కే టికెట్ ఇవ్వాలని తమ్ముళ్లు పట్టుబట్టడం అయినా.. చంద్రబాబు నాన్‌లోకల్ వైపే మొగ్గు చూపడంతో వంగలపూడి అనిత చిత్తుగా ఓడిపోయారు. ఇక్కడ నుంచి గెలిచిన వనిత.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. ఇదిలావుంటే, తాను ఓడిపోయినా.. నియోజకవర్గాన్ని వీడబోనని శపథం చేసిన వంగలపూడి అనిత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పైగా చంద్రబాబు ఎలాంటి కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా వంగలపూడి అనిత దూరంగానే ఉంటున్నారు. ఏదో వచ్చినట్టే వచ్చి.. కనిపించినట్టే కనిపించి వెళ్తున్నారు. కార్యకర్తలు కూడా పెద్దగా వంగలపూడి అనితను పట్టించుకోవడం లేదు. పోనీ, మళ్లీ పాయకరావు పేటకే వెళ్లి పాగా వేయాలన్నా.. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన బంగారయ్య ఉండడంతో ఇప్పుడు ఎటు వెళ్లాలన్నా.. ఆమెకు ఛాన్స్ చిక్కడం లేదు. కొవ్వూరులో అయినా కేడర్‌ను పెంచుకుందామన్నా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. వంగలపూడి అనిత విశాఖకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజవకర్గాలకూ వంగలపూడి అనిత కాకుండా పోయిందనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. మరి ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే..!