విజయవాడ, సెప్టెంబర్ 25, (way2newstv.com)
ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో తలమునకలై ఉన్నారు. పాలన ఒకవైపు చూసుకుంటూనే మరోవైపు ప్రజలకు చేరువవ్వాలని వైెఎస్ జగన్ నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం పెట్టినా అది నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించే కార్యక్రమం కాదు. అందుకోసమే ప్రజాదర్బార్ ను నిర్వహించాలని భావించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వెంటనే ప్రజాదర్బార్ కు కావాల్సిన ఏర్పాట్లు చూడమని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించినా ఇంతవరకూ అమలుకు నోచుకోలేదుతండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైఎస్ జగన్ పయనించాలనుకున్నారు.
ప్రజాదర్బార్ కు అడగడుగునా అడ్డంకులే
ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఆయన చేద్దామనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు వైఎస్ జగన్. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే వైఎస్ఆర్ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకునే వారు. ఈ ప్రజాదర్బార్ తో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరింత మైలేజీ పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు.అదే ప్రజాదర్బార్ ను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించాలనుకున్నారు వైఎస్ జగన్. ఈమేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే తాడేపల్లి నివాసమే వైఎస్ జగన్ అధికారిక నివాసమయింది. పక్కనే ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాలనుకున్నారు. అయితే పార్టీ కేంద్రకార్యాలయాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చడంతో ఇందులో ప్రజాదర్బార్ ను నిర్వహించలేకపోతున్నారు.ఇప్పటికే తాడేపల్లిలోని జగన్ నివాసానికి పెద్దయెత్తున ప్రజలు తమ సమస్యలను వివరించేందుకు వస్తున్నారు. అయితే నేరుగా జగన్ ను కలిసేందుకు వీరికి వీలుపడటం లేదు. రోజుకు రెండు నుంచి మూడువేల మంది వస్తుండటంతో భద్రత పరంగా కూడా అధికారులకు సమస్యగా మారింది. అందుకోసం అర్జీలను స్వీకరించేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలనుంచి అర్జీలను అధికారులే స్వీకరిస్తున్నారు. రెండు వేల మందిని జగన్ కలుసుకునే అవకాశం లేదు. అందుకు సమయం కూడా సరిపోదు. దీంతో ప్రజాదర్బార్ ను నిర్వహించాలన్న వైఎస్ జగన్ ఆదేశం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రజాదర్బార్ పై ఇప్పటికే నాలుగైదు తేదీలు ప్రకటించినా ఇది అమలుకునోచుకోలేదు.