నిలిచిన సురక్ష (కృష్ణ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిలిచిన సురక్ష (కృష్ణ)

మచలీపట్నం, సెప్టెంబర్ 18 (way2newstv.com): 
ముఖ్యమంత్రి బాల సురక్ష పేరిట కొనసాగుతున్న రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం సేవలు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయాయి. సంచార వాహనాలకు సంబంధించిన అద్దె బకాయిలు, సిబ్బంది వేతనాలు విడుదల చేయడంలో నెలకున్న జాప్యమే కారణంగా తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో ప్రారంభించిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సోమవారం నుంచి సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నా ప్రస్తుతానికి స్పష్టత కొరవడింది. ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. 
నిలిచిన సురక్ష (కృష్ణ)

రాష్ట్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పేరిట అమలు చేస్తున్నారు. దీని నిర్వహణ కాంట్రాక్టును ‘ధనుష్‌ డిజిటల్‌ హెల్త్‌’ సంస్థకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గానికి విధిగా ఒక వాహనం ఉండేలా కేటాయింపులు చేపట్టారు. వైద్య సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో నియమించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 18 ఏళ్లలోపు విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడే చిన్నారులు, విద్యార్థులను గుర్తించి స్థానికంగా ఉన్న ఉన్నత వైద్యశాలలకు తరలిస్తున్నారు.పుట్టుకతోనే గ్రహణం మొర్రి, దృష్టిలోపం, గుండెలో రథ్రం, కంటికి కనిపించని అవయవ లోపాలు, చెవిటి, మూగ వంటి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తున్నారు. శస్త్రచికిత్సలు, ఉన్నత వైద్యం ఖర్చు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లి విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంచార వాహనం ద్వారా సేవలు అందిస్తూ వచ్చారు. 2012లో జవహర్‌ బాల ఆరోగ్య రక్ష పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా, తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంగా కొనసాగించారు. ఈ కార్యక్రమం అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో మరికొన్ని అంశాలను జోడించి పీపీపీ విధానంలో అమలు బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. పుట్టకతో లోపాలు ఉన్న అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి ఆరు నెలల వయసున్న చిన్నారులను ఆశా వర్కర్లు, ఆరు వారాల నుంచి ఆరు ఏళ్ల వరకు పిల్లలను అంగన్‌వాడీ సిబ్బంది గుర్తించి నమోదు చేసిన వివరాలను సంచార వైద్య బృందానికి అందజేస్తూ వచ్చారు. 6 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులను గుర్తించడానికి నేరుగా సంచార వైద్యబృందం సభ్యులు పాఠశాలలు, కళాశాలల్లో స్క్రీనింగ్‌ చేసేవారు. వైద్యసేవలు పారదర్శకంగా అందించడానికి సీడీపీవో, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. బాలబాలికలకు అందించిన సేవలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల రిఫరల్‌ మేనేజర్‌ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా సమన్వయకర్తను నియమించారు. ఇప్పటి వరకు నాలుగు అంశాల్లో 30 రకాల పరీక్షలు చేసేందుకు బృందంలోని ఒక్కో వైద్యుడు రోజుకు 120 మందిని పరీక్షిస్తున్నారు. శస్త్ర చికిత్సలు పూర్తి ఉచితంగా చేయడం వల్ల తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊరటనిచ్చింది. పల్లెల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క గ్రామాల్లో నిర్వహించిన శిబిరాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సేవలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు పర్యవేక్షిస్తున్న అధికారులకు సమాచారం అందించారు. కార్యక్రమం నిలిచిపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.