కోడెల ఇక లేరు..శోక సంద్రంలో పల్నాడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోడెల ఇక లేరు..శోక సంద్రంలో పల్నాడు

గుంటూరు సెప్టెంబర్ 16 (way2newstv.com)
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కోడెల శివ ప్రసాద్ రావు ఆకస్మికంగా మృతి చెందారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన ఆయనపై వైసీపీ ప్రభుత్వం లేనిపోని కేసులు నమోదు చేయడంతో తీవ్ర వత్తిడికి లోనయ్యారు. దీంతో దివంగత ఎన్ఠీఆర్ పిలుపుతో టీడీపీలో కోడెల చేరారు. ముందు నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా వున్నారు. పల్నాడులో పులిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్రం విడి పోయాక ఏపీకి సభాపతిగా పని చేశారు. ఉన్నతమైన పదవులు సమర్థవంతంగా పని చేసి పేరు తెచ్చుకున్నారు. వృత్తి రీత్యా ఆయన వైద్యుడిగా పని చేశారు. గుంటూరు జిల్లాలో గొప్ప వైద్యుడిగా మన్ననలు అందుకున్నారు. వ్యక్తిగా అత్యంత ధైర్యం కలిగిన కోడెల శివ ప్రసాద్ రావు బలవన్మరణానికి పాల్పడటంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. 
కోడెల ఇక లేరు..శోక సంద్రంలో పల్నాడు

వేలాది మంది కార్యకర్తలు, నాయకులకు భరోసా కల్పించిన ఆయన చివరకు ఇలా వెళ్లి పోవడం బాధాకరం.హోమ్ శాఖా మంత్రిగా, పంచాయతీరాజ్, నీటి పారుదల , ఆరోగ్య , పౌరసరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు. కోడెల వ్యక్తిగతంగా తన ఇమేజ్ డామేజ్ కావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. పలువురు సీనియర్ నేతలు ఇది రాజకీయ హత్యగా పేర్కొన్నారు. రాజకీయాలలో పులి లాగా బతికాడు. ఆయన వయసు 72 ఏళ్ళు. గుంటూరు జిల్లా కండ్లకుంట ఆయన స్వస్థలం. ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముందు నుంచి ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు నాయుడుకు కుడి భుజంగా ఉంటూ వచ్చారు. పల్నాడు ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉంటూ వచ్చారు. ఎన్ఠీఆర్ పిలుపుతో 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదు సార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు ఓటమి పాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రి వర్గంలో పలు శాఖల్లో పని చేశారు.చిన్న తనంలో తోబుట్టువులు అనారోగ్యంతో చని పోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న ఆ రోజుల్లో వైద్య విద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్య ఆభ్యసించడానికి ముందడుగు వేసాడు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్య వృత్తిని చేపట్టారు. వైద్యవృత్తిని ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు. ఆయన హస్త వాసి గొప్పదని పేరుంది. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు. తిరుగులేని సర్జన్ గా కీర్తి గడించిన డాక్టర్ కోడెలపై  ఎన్టీఆర్ దృష్టి పడింది.పల్నాడులో అప్పటికే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచకాలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే దివ్య ఔషదంగా భావించి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఇష్టం లేక పోయినప్పటికీ, వైద్య వృత్తి తారా స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీలో చేరి మొదటి సారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే..మరో వైపు ప్రజలకు వైద్య సేవలు అందించారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవి చూశారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు అయన. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు.నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా చేశారు.   ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. యంత్రాలను ఏర్పాటు చేసి త్రాగు నీటి వసతి కల్పించారు. గ్రామాల్లో చాలా కాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క  గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు. ఇంత భారీ మొత్తాలు మునుపెన్నడూ ఇవ్వలేదు. సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలో ఆదర్శ పురపాలక సంఘంగా ఎంపికైంది. లక్ష మరుగుదొడ్లు నిర్మించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు.50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి చరిత్ర సృష్టించారు. 2014 లో  కామెరూన్ లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ ల సమావేశానికి  హాజరయ్యారు. మారిషస్ , సౌత్ ఆఫ్రికా, నైరోబీ, కెన్యాలలో జరిగిన పోస్ట్ కాన్ఫరెన్స్ అధ్యయన పర్యటనలో పాల్గొన్నారు. ఢాకా, బంగ్లాదేశ్ లో జరిగిన 26వ కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్ కు హాజరయ్యారు. కువైట్ లో జరిగిన తెలుగు సంఘంలో , 2015 లో సింగపూర్ లో జరిగిన స్వచ్చ భారత్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. లండన్ లో  జరిగిన   కనెక్ట్ విటి డాట్స్ , హాంబర్గ్ ఇండియా ప్రోగ్రాంకు హాజరయ్యారు.మొత్తం మీద ఎంతో అనుభవం కలిగిన కోడెల అకాల మరణం తెలుగు వారిని దిగ్బ్రాంతికి లోను చేసింది.