రిబ్బన్ కటింగ్ లకు వేళాయెరా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రిబ్బన్ కటింగ్ లకు వేళాయెరా

ఏలూరు, సెప్టెంబర్ 27, (way2newstv.com)
ప్రారంభోత్సవం అంటే ఒక్కసారే జరుగుతుంది. అలా జరిగితే అందం, అర్ధం ఉంటాయి. కానీ ఇపుడున్న రాజకీయానికి రిబ్బన్ కటింగ్ ముచ్చట బాగా ఎక్కువగా ఉంది. అందువల్ల స్టేషన్ కి ఒక్క లెక్కన రిబ్బన్ కటింగులు చేసుకుంటూనే పోతున్నారు. అనేక వాయిదాల తరువాత విశాఖపట్నం విజయవాడ మధ్యన ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎట్టకేలకు ప్రారభోత్సవానికి నోచుకుంది. మొదట కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వస్తారని ప్రచారం జరిగినా తరువాత మాత్రం సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడి చేత జెండా ఊపించేశారు. ఇంతవరకూ కధ బాగానే ఉన్నా ఇదే రైల్లో తాడేపల్లిగూడేం వరకూ వెళ్ళిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అక్కడ అగి మరో మారు రిబ్బన్ కట్ చేసి మరీ జెండా ఊపేశారు. 
 రిబ్బన్ కటింగ్ లకు వేళాయెరా

దీంతో ఇదేం చోద్యమని అనుకోవాల్సిన పరిస్థితి రైల్వే అధికారులకు, జనానికి కూడా ఏర్పడింది.ఇదిలా ఉండగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడి నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటివరకూ గట్టిగా కార్యక్రమం ఏదీ ఎక్కడా లేదు, మరీ ముఖ్యంగా ఎంపీలకు అసలు పని లేకుండా పోయింది. జనానికి ఇది చేశామని చెప్పుకోవడానికి ఏదీ లేకపోవడంతో అంతా కలసి ఇలా ఉదయ్ ఎక్స్ ప్రెస్ మీద పడ్డారని అంటున్నారు. ఏకంగా ఢిల్లీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వస్తే, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు పెద్దసంఖ్యలో విశాఖ వచ్చి మరీ ఈ ప్రారంభోత్సవ హడావుడి చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని ఏపీకి కొత్త రైళ్ళు, లైన్లు ఎన్నో తెస్తామంటూ ఆ హుషారులో ఎంపీలు హామీలు కూడా గుప్పించారు.ఇదిలా ఉంటే ఈ సంబరం ఎంతో సేపు నిలవనీయకుండా వామపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనకారులు మంత్రి, ఎంపీలకు తమ నిరసన తెలియచేయ‌డంతో విస్తుబోవడం నేతల వంతు అయింది. వాల్తేరు జోన్ అంటూ ఇన్నాళ్లు నల్ల జెండాలు, ప్ల కార్డులు చూపించిన వారంతా ఇపుడు వాల్తేరు డివిజన్ రద్దుపై గుర్రుమంటున్నారు. దానికి కొన‌సాగించి విశాఖ జోన్లో కలపాలని చేస్తున్న డిమాండ్ కి బీజేపీ, వైసీపీ నేతలకు మింగుడు పడని వ్యవహారమైంది. దీని మీద జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ డివిజన్ పోకుండా చూస్తామని నామమాత్రపు హామీ ఇచ్చారు కానీ కేంద్ర రైల్వే మంత్రి మాత్రం మౌనం పాటించడంతో డివిజన్ కధ కంచికి చేరినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి రైలు రిబ్బన్ కటింగులతో తమదైన సంబరాలు చేసుకుందామనుకున్న అధికార పార్టీ నేతలకు విశాఖ ఉద్యమకారులు తమదైన శైలిలో గట్టి ఝలక్ ఇచ్చారని అంటున్నారు.