వైద్యం చేసేవారేరీ..? (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైద్యం చేసేవారేరీ..? (పశ్చిమగోదావరి)

ఏలూరు, సెప్టెంబర్ 18 (way2newstv.com): 
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తే రోగులతో కిటకిటలాడుతున్నాయి. నిత్యం వేలాది మంది రోగులు వైద్య పరీక్షల నిమిత్తం వస్తుండగా అందుకు సరిపడా పడకలు గతంలో ఉండేవి కాదు. ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగే రోజులొచ్చాయి. రోగులకు సరిపడా పడకలను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చింతలపూడి, పాలకొల్లు, భీమవరం ప్రభుత్వాసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచారు. తణుకు ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రి హోదా లభించింది. ఇంతకీ ఆయా ఆసుపత్రుల హోదాకు తగ్గట్టు వైద్యులు, సిబ్బందిని నియమిస్తే అధునాతన వైద్యం రోగులకు చేరువైనట్లేనని పలువురు పేర్కొంటున్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రి సామాజిక ఆరోగ్యకేంద్రం నుంచి 2000లో కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రంగా వర్గోన్నతి పొందింది. 
 వైద్యం చేసేవారేరీ..? (పశ్చిమగోదావరి)

రూ. 6.5 కోట్లతో అధునాతనంగా నిర్మించిన భవనంలో వైద్యసేవలందిస్తున్నా నిత్యం వచ్చే సుమారు 400 మంది రోగులకు  సేవలందించే వైద్య, సిబ్బంది పూర్తిస్థాయిలో లేక ఉన్న కొద్దిమంది సతమతమవుతున్నారు. బుట్టాయగూడెంలో రూ. 3.5 కోట్లు, నరసాపురంలో రూ. 5.5 కోట్లు, నిడదవోలులో రూ. 3 కోట్లు భవన నిర్మాణాలకు కేటాయించారు.ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవలో భాగంగా పలు ఆసుపత్రుల్లో రూ. 5.60 లక్షల విలువైన 300 ఎంబీ డిజిటల్‌ ఎక్స్‌రే పరికరం, రూ. 5 లక్షల విలువైన వార్మర్‌, ఫోటోథెరఫీ పరికరాలు, రూ. 6 లక్షల విలువైన స్కానింగ్‌ పరికరాలున్నాయి. జిల్లాలోని 12 ఆసుపత్రులకు ఒక్కొక్కటి రూ. 12 లక్షల విలువైన ఆప్తాలమిక్‌ ఆపరేటింగ్‌ మైక్రోస్కోప్‌ పరికరాలను సరఫరా చేశారు. ఆయా పరికరాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసేలా వైద్యులు, సిబ్బందిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం పడకలు పెంచిన ఆసుపత్రుల్లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సి ఉంది. 24 మంది నర్సులు, నలుగురు సివిల్‌ సర్జన్లు, ఎంబీబీఎస్‌ వైద్యులు, ఆర్థోపెడిక్‌, ఆప్తామాలజీస్ట్‌, స్త్రీల ప్రసూతి వెద్య నిపుణులు ఇద్దరు అందుబాటులో ఉండాలి. గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్న అరకొర వైద్యులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. దాంతో ఎవరైనా వైద్యుడు సెలవుపెడితే రోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. అటువంటి సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వెనుదిరిగి వెళ్లలేక సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించాల్సి వస్తుంది. జిల్లా ఆసుపత్రిగా తణుకు ప్రభుత్వాసుపత్రి వర్గోన్నతి పొందగా ఇప్పటికీ ఆ దిశగా పూర్తి సేవలు చేరువ కాలేదు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులయ్యే వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వర్గోన్నతి తగ్గట్టుగా సేవలు చేరువ చేయాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. శస్త్రచికిత్స విభాగాలు, మార్చురీలు, అత్యవసర సేవల విభాగం, ఈఎన్‌టీ, చర్మవ్యాధుల, మానసిక వ్యాధి చికిత్స విభాగాలు ఏర్పాటుకావాల్సి ఉంది.