బీజేపీలో రెండు గ్రూపులు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీలో రెండు గ్రూపులు...

విశాఖపట్టణం, సెప్టెంబర్ 27, (way2newstv.com)
అదేంటో ఏపీలో ఒకే ఒక ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఉన్నపుడు బీజేపీ రెండు వర్గాలుగా ఉండేది. ఒక వర్గం జాతీయ నాయకత్వాన్ని అనుసరిస్తే రెండవ వర్గం చంద్రబాబు భజన చేస్తూ కాలక్షేపం చేసింది. ఇపుడు ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దానికి తగినట్లే ప్రాంతాలు, సామాజిక సమీకరణలు మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎన్నో వర్గాలుగా విడిపోతోంది. చెప్పుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఏపీ బీజేపీలో ఏ పార్టీలో లేనంత భిన్నత్వం కనిపిస్తోంది. దీన్ని వారు ప్రజాస్వామ్యం అనుకుంటారేమో కానీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి ఒక విధానం అంటూ లేదా అన్నది జనంలోకి వెళ్తున్న సందేశం. పార్టీలో ఉన్నవారికి కూడా అదే పెద్ద సందేహం.
బీజేపీలో రెండు గ్రూపులు...

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ని ప్రతీ రోజూ తిట్టిపోసే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక వైపు ఉన్నారు. మరో వైపు కొత్త పూజారులుగా బీజేపీలో చేరిన సుజనాచౌదరి వంటి వారు గొంతు ఇప్పటికీ టీడీపీ స్వరంగానే ఉంటోంది. ఒంటికాలి మీద లేచి మరీ జగన్ ని విమర్శిస్తున్న సుజనాచౌదరి బాబును పల్లెత్తు మాట అనకుండా స్వామి భక్తిని చూపుతారు. ఇక బీజేపీలో మొదటి నుంచి ఉన్న వర్గం కేంద్ర విధానాల ప్రకారం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలనుకుంటోంది. ఇది చాలదన్నట్లుగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వంటి వారు జగన్ విధానాలను మెచ్చుకుంటారు. ఏపీకి రాజధాని ఎక్కడ పెట్టాలన్నది జగన్ ఇష్టమని కూడా తేల్చిచెబుతారు. పోలవరంలో అవినీతి జరిగిందని కూడా అంటారు. బాబు అండ్ కోను చీల్చిచెండాడుతారు.ఇది చాలదన్నట్లుగా బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు జగన్ ప్రభుత్వం విధానాలను పూర్తిగా మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నారు. అక్రమ కట్టడాలు కూల్చేయాల్సిందేనని కూడా విష్ణు అంటున్నారు. చంద్రబాబు ఇల్లును తక్షణం ఖాళీ చేయాలని కూడా ఆయన సూచించడం విశేషం. ఇక వైసీపీ సర్కార్ చేపడుతున్న రివర్స్ టెండరింగ్ విధానాలను కూడా ఆయన సమర్ధిస్తున్నారు. టీడీపీని తెలుగు దొంగల పార్టీగా పేర్కొంటున్న విష్ణు ఆ పార్టీలో చివరికి చంద్రబాబు, లోకేష్ మాత్రమే మిగులుతారని చెప్పుకొచ్చారు. తీహార్ జైల్లో టీడీపీ మిత్ర పక్షం కాంగ్రెస్ నేతలు ఉన్నారని, ఇక తరువాత ఛాన్స్ టీడీపీదేనని కూడా ఆయన అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు బ్యాచ్ జైలుకు వెళ్ళాలని బీజేపీలోకి ఓ వర్గం గట్టిగా కోరుకుంటూంటే బాబు మీద ఈగ వాలనీయకుండా మరో వర్గం కాసుకుంటోంది. కమలం ఇన్ని రకాలుగా రంగులు మారుస్తూంటే ఏపీలో ఎదిగేదెపుడు, ఎత్తిగిల్లేదేపుడు అన్న ప్రశ్న సహజంగానే అందరిలోనూ కలుగుతోంది.