మ్యానిఫెస్టో అజెండానే జెండాగా జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మ్యానిఫెస్టో అజెండానే జెండాగా జగన్

విజయవాడ, సెప్టెంబర్ 6, (way2newstv.com)
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బయట పెద్దగా మాట్లాడటం లేదు. తన పని తాను చేసుకుని వెళుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సయితం ఆయన సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల అమలు, మరోవైపు పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడుతూనే ఇంకోవైపు హార్డ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే పార్టీ చేరికలకు కూడా జగన్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో జగన్ వైఖరికి రాజకీయ నేతలకు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది.రాజధాని విషయంనుంచి పోలవరం విషయం వరకూ ఎక్కడా తగ్గడం లేదు జగన్ ప్రభుత్వం. పోలవరం టెండర్లను రద్దు చేసేసింది.
మ్యానిఫెస్టో అజెండానే జెండాగా జగన్

పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పు పట్టినా రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనని నిర్ణయించింది. అలాగే మచిలీపట్నం పోర్డు టెండర్ ను కూడా రద్దు చేసింది. భూములను కూడా వెనక్కు తీసుకుంది. దీంతో పాటు పోలవరం కాంట్రాక్టరకు ఇచ్చిన అడ్వాన్స్ 700 కోట్లను కూడా వెనక్కు తీసుకునేందుకు సిద్ధమయింది. పోలవరం ప్రాజెక్టు కొంత ఆలస్యమయినా పరవాలేదన్న ధోరణిలో జగన్ సర్కార్ ఉంది.ఇక సంక్షేమ పథకాల విషయంలోనూ ఏమాత్రం జగన్ ప్రభుత్వం వెనకకు చూడటం లేదు. ఆర్థిక పరిస్థిితి వెక్కిరిస్తున్నప్పటికీ ఆశా వర్కర్ల జీతాలను పదివేలకు పెంచారు. పలాస లో కిడ్నీ వ్యాధిగ్రస్థుల కోసం ప్రత్యేక ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఆర్థికంగా భారీగా మోత తప్పదని తెలిసినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి రెడీ అయ్యారు జగన్. జగన్ దీనిపై ఎంత ఫర్మ్ గా ఉన్నారంటే… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై నియమించిన ఆంజనేయరెడ్డి కమిటీ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలనకున్నా, జగన్ కల్పించుకుని ఫైనల్ నివేదికను ఇవ్వాలని చెప్పడంతోనే జగన్ ఆర్టీసీని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పకనే తెలుస్తోంది.ఇక ఇలాంటి నిర్ణయాలతో పాటు కొన్ని హార్డ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. తొలిసారి తన ప్రభుత్వం వచ్చాక సీబీఐకి కేసును అప్పగించారు. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణకు జగన్ ఆదేశించారు. దీంతోపాటు పార్టీపై కూడా ఒక కన్నేసి ఉంచారు. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. స్వయంగా తానే కండువాలు కప్పుతున్నారు. టీడీపీ నేత ఆడారి ఆనంద్ ను జగన్ స్వయంగా దగ్గరుండి పార్టీలో చేర్చుకున్నారు. మరికొందరు నేతలు పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇలా మొత్తం మీద జగన్ అన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఏ విషయంపైనా పెదవి మాత్రం విప్పడం లేదు. దీంతో విపక్ష పార్టీనేతలు తాము ఎంత రెచ్చగొట్టినా జగన్ మాట్లాడకపోవడంపై పిచ్చెక్కేలా ఉందని ఒక వైసీపీ నేత వ్యాఖ్యానించారు.