పితాని పక్క చూపులు చూస్తున్నారా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పితాని పక్క చూపులు చూస్తున్నారా...

విజయవాడ, సెప్టెంబర్ 28, (way2newstv.com)
రాజ‌కీయాల్లో సీనియర్ నేత‌, సౌమ్యుడు, వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పితాని స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయ భ‌వితవ్యం ఎటు ? ఆయ‌న ఎలా ముందుకు వెళ్ల‌నున్నారు ? టీడీపీలో ఎందుకు ఇమ‌డ‌లేక పోతున్నారు ? ఆయ‌న ఎందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లే.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పితాని సత్యనారాయణ ప‌క్క చూపుల‌కు కార‌ణాలు.. ఆయ‌న రాజ‌కీయ జీవితం చివ‌ర్లో సంభ‌విస్తోన్న మార్పులేంటో చూస్తే కాస్త ఆస‌క్తిక‌ర అంశాలే క‌నిపిస్తున్నాయి.
పితాని పక్క చూపులు చూస్తున్నారా...

ముందు నుంచి కాంగ్రెస్‌లో ఉన్న పితాని.. 2004లో పెనుగొండ (ర‌ద్ద‌య్యింది), 2009లో ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. వైఎస్‌, కిర‌ణ్, రోశ‌య్య‌ కేబినెట్‌ల‌లో చోటు సంపాయించుకున్నారు. అయితే, వైఎస్ మ‌ర‌ణం, త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న, రాజ‌కీయ ఆటుపోట్ల నేప‌థ్యంలో 2014లో టీడీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి ముచ్చ‌ట‌గా ఆచంట నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. ఆ స‌మ‌యంలోనే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అనుకున్నా రాలేదు. అయితే, 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. కాగా, మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు.నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి పితాని సత్యనారాయణ వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఆయ‌న ఖండించారు. ఇక‌, ఇక్క‌డ చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు అనూహ్యంగా వైసీపీ త‌ర‌ఫున టికెట్ సంపాయించుకుని పోటీ చేసి. పితాని సత్యనారాయణపై విజ‌యం సాధించారు. కుల స‌మీక‌ర‌ణ‌లు బ‌లంగా ప‌నిచేసే ఆచంట‌లో క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన రంగ‌నాథ‌రాజు విజ‌యం సాధించ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వి సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు అక్క‌డ ఆయ‌న చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక ప‌దిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే, మంత్రిగా ఏక‌చ‌క్రాధిప‌త్యంగా ఇక్క‌డ రాజ‌కీయాలు త‌న క‌నుసైగ‌ల‌తో శాసించిన పితాని సత్యనారాయణ ఇప్పుడు టీడీపీలో ఇమ‌డ‌లేక పోతున్నారు. అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.జిల్లా పార్టీలోని బాబు సామాజిక వ‌ర్గం నేత‌లే త‌న‌ను ఓడించార‌ని పితాని సత్యనారాయణ చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి తాను ఎంతో చేశాన‌ని, అయితే, కొంద‌రు కావాల‌ని త‌న‌కు వ్య‌తిరేకంగా తెర‌చాటు ప్ర‌చారం చేశార‌ని, ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా ఖండించ‌లేద‌ని, చ‌ర్య‌లు తీసుకోలేద‌ని పితాని సత్యనారాయణ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారట‌. దీంతో ఆయ‌న ఇప్ప‌టికైనా వైసీపీలోకి వెళ్లాల‌ని చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, రంగ‌నాథ‌రాజుతో పాటు పితాని సత్యనారాయణ బాధితులు మాత్రం పితాని రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.అదే ఎన్నిక‌ల‌కు ముందు పితాని సత్యనారాయణ వైసీపీలోకి వెళ్లి ఉంటే ఆయ‌న‌కు న‌ర‌సాపురం ఎంపీ టిక్కెట్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు పితాని సత్యనారాయణ వ‌ర్గం చెవులు కొరుక్కుంటోంది. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న టీడీపీ మాజీ నేత సుజ‌నా చౌద‌రితో పితానికి చాలా ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం ప‌క్క చూపులు చూస్తుండ‌డంతో ఏ పార్టీలోకి జంప్ చేస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి పితాని ఏం చేస్తారో ? చూడాలి. 15 ఏళ్లుగా అధికారానికి అల‌వాటు ప‌డ్డ పితాని ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉంటూ.. ప‌ద‌వీ లేకుండా ఖాళీగా ఉండి రాజ‌కీయం న‌డ‌ప‌లేక‌పోతున్నార‌ని ఆచంట‌తో పాటు జిల్లా రాజ‌కీయాల్లో వినిపించే టాక్‌.