ఆదుకోని ఉపాధి హామీ పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆదుకోని ఉపాధి హామీ పథకం

కడప, సెప్టెంబర్  28, (way2newstv.com
కడప జిల్లాలో ఏళ్లకు ఏళ్లుగా వర్షాలు లేక వట్టి కరువు ప్రజలను పట్టి పీడిస్తోంది. ఆరు ఏళ్లు కరువు రక్కసి వెంటాడి వేధిస్తోంది. జిల్లాలో గుక్కెడు నీరు లేక ప్రాజెక్టులు వెలవెల బోతున్నాయి. పంటల సాగు పడకేసింది. బీళ్లుగా మారి నేలలన్నీ నోరెళ్లబెట్టాయి. గ్రామాల్లో జీవనాధారంగా ఉన్న వ్యవసాయం సన్నగిల్లడంతో బతుకు దెరువు కోసం అటు వలసలు వెళ్లలేక, ఇటు ఉన్నఊరిని విడువలేక పరువు కోసం ఉపాధి పనులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనులతో ఆదుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం మాటలకు క్షేత్ర స్థాయిలో కనిపించే వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. ఉపాధి కార్మికులకు చెల్లించే కూలీ సొమ్ము ఏ కోశానా గిట్టుబాటు కావడం లేదు. 
ఆదుకోని ఉపాధి హామీ పథకం

బద్వేలు మండలంలోని లక్ష్మిపేట, నక్కలగుంట ఉపాధి కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితే సమస్యకు అద్దంపడుతోంది. జిల్లాలో దాదాపు 5.34 జాబ్‌కార్డులు పంపిణీ అయ్యాయి. ఇందులో 3.31 లక్షల కార్డులు తరచుగా పనిలో ఉంటున్నారు. ప్రస్తుతం 2.34 లక్షల మంది పనిలో ఉన్నారు. బద్వేలు మండలం అనంతరాజుపాలెం పంచాయతీ పరిధిలోని లక్ష్మిపాలెం, నక్కలగుంటలో 1300 జాబ్‌ కార్డులు ఉన్నాయి. 880 మంది ఉపాధి కార్మికులు పని చేస్తున్నారు. వీరు ప్రతిరోజూ ఉదయం సుమారు ఆరుగంటల నుంచి 11 గంటల వరకు ఉపాధి పని చేస్తే సగటున రూ.75 మాత్రమే వస్తోంది. వారానికి రూ.250 నుంచి రూ.400 మాత్రమే వస్తోంది. ఒక్కోసారి నేల గిడుసుబారి ఉండడం వల్ల చేసే పనుల్లో పురోగతి ఉండడం లేదని, ముఖ్యంగా కొలతల్లోనూ ఏమాత్రం స్పష్టత ఉండడం లేదని చేతులు బొమ్మలెక్కుతున్నాయని వాపోతున్నారు. ఒక్కో సారి కేవలం రూ.20 మాత్రమే రోజుకు కూలీ పడుతోంది. ఏమాత్రం కూలీ గిట్టుబాటుకాక కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వచ్చే కూలితో దినసరి అవసరాలు తీరక వేరే పనుల్లేక అవకాశాలు లేక ఉపాధి కార్మికులు ఈ పనులనే నమ్ముకుని బతుకు ఈడ్చాల్సి వస్తోదీనికి తోడు మస్టర్లలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసని పనికి సంబంధించి చెల్లించాల్సిన సొమ్ముకు వివరాలను తెలిపే పే స్లిప్పులు అధికారులు కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా ఇవేవి వారికి అందడం లేదు. వచ్చే అరకొర కూలీ కారణంగా కార్మికులు ఆర్థాకలితో, పస్తులతోనే పూట గడపాల్సి వస్తున్న దుస్థితి వారికి ఎదురవుతోంది. ఇదే పరిస్థితి జిల్లాలో పలు చోట్ల కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు కనీసం ఈ విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు స్పందించి కరువు నుంచి ఆదుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని పలువురు ఉపాధికార్మికులు కోరుకుంటున్నారు