150 కోట్లకు చేరుకున్నరైస్ మిల్లర్ల బకాయిలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

150 కోట్లకు చేరుకున్నరైస్ మిల్లర్ల బకాయిలు

ఏలూరు, అక్టోబరు 23, (way2newstv.com)
పశ్చిమ గోదావరి జిల్లా రైస్‌ మిల్లులకు వరుస కష్టాలు వచ్చి పడుతున్నాయి.ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో దిక్కు తోచని స్థితిలో మిల్లర్లు కొట్టుమిట్టాడుతున్నారు  పశ్చిమలో గత ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 26.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంను మరాడించగా సుమారు 12.10 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వచ్చింది. లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మరాడించిన మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాది కాలంగా ప్రభుత్వం చెల్లింపులు జరపలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్ల వద్ద మరాడించి, బియ్యాన్ని తిరిగి తీసుకోవడాన్ని కస్టమ్‌ రైస్‌ మిల్లింగ్‌  విధానంగా ప్రభుత్వం నామకరణం చేసింది.
150 కోట్లకు చేరుకున్నరైస్ మిల్లర్ల  బకాయిలు

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు  స్వీకరించినప్పటి నుండి కస్టమ్‌ మిల్లింగ్‌ విధానం కొనసాగుతోంది. భారత ఆహార సంస్థ ద్వారా గతంలో బియ్యం సేకరించి రాష్ట్ర ప్రభుత్వం సివిల్‌ సప్లయ్‌ ద్వారా రేషన్‌ షాపులకు సరఫరా చేస్తుండేది. రైస్‌ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి 70 శాతం ఎఫ్‌సీఐకి, 30 శాతం ప్రైవేటు మార్కెట్‌లో అమ్ముకునే విధంగా కేంద్రం అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లర్లకు మరాడించే పద్ధతిని అమలులోకి తీసుకువచ్చింది. కస్టమ్‌ రైస్‌మిల్లింగ్‌ విధానంలో ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం మరాడించేందుకు, ఆరుదలలో తరుగు ధాన్యానికి, తేమ శాతంకు, ధాన్యం, బియ్యం నిల్వ ఉంచినందుకు, వాట ని ఎగుమతి, దిగుమతి చేసినందుకు చార్జీలు చెల్లిస్తుంది. ఆయా చార్జీల నిమిత్తం గత ఖరీఫ్, రబీ సీజన్‌లలో జిల్లాలోని మిల్లర్లకు రూ.152 కోట్ల మేర బకాయి పడింది.  పరిశ్రమ ఒడుదుడుకులు ఎదుర్కోవడంతోపాటు, దాని ప్రభావం అనుబంధ రంగాలు, రైతులపై పడుతోంది. రైస్‌ మిల్లింగ్‌ ఇండస్ట్రీపై ఆర్థిక భారం పడింది. ఏడాది కాలంగా మిల్లర్లు ధాన్యాన్ని మరాడించినందుకు అయ్యే విద్యుత్‌ చార్జీలు, పెరిగిన కార్మికుల జీతాలు, పరిశ్రమలోని ఇతర ఉద్యోగుల జీతాలు, పీఎఫ్, ఇతరత్రా ఖర్చులు భరాయిస్తూ ప్రభుత్వానికి సీఎమ్మార్‌ బియ్యం చెల్లిస్తున్నారు. క్వింటాలు ధాన్యం మరాడించేందుకు ప్రభుత్వం రూ.15 మజూరు చార్జి ప్రకటించగా, బిల్లు చెల్లించే సరికి రూ. 12.50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారని, మిగిలిన రూ.2.50 పైసలు ధాన్యం కిరాయిల కింద మినహాయించడం సరైన పద్ధతి కాదంటున్నారు. క్వింటాలు ధాన్యం మరాడించేందుకు విద్యుత్‌ చార్జి రూ.30 వ్యయమవుతోందని మిల్లర్లు వాపోతున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ము విద్యుత్‌ చార్జీలకు సరిపోవడంలేదని, ఇతరత్రా ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 అవుతున్నప్పటికీ, అసలు చెల్లించాల్సిన చార్జీలు చెల్లించకపోవడంతో మిల్లులు ఎలా నడపాలని మిల్లర్లు వాపోతున్నారు. తేమ శాతంలో కూడా దగా జరుగుతోందని ప్రభుత్వం ధాన్యంలో తేమ 17 ఉండాల్సి ఉండగా అంతకు మించిన తేమతో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. 3 శాతం తేమ ఉండగా ఒక శాతం తరుగు మాత్రమే చెల్లించడం దారుణమంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి, నెట్లు కట్టి, నిల్వ ఉంచి మరాడించగా వచ్చే బియ్యాన్ని 15 రోజుల్లో ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. అయితే నెలల తరబడి బియ్యం మిల్లర్ల వద్దే నిల్వ ఉంటున్నాయి. గోదాములు ఖాళీ లేకపోవడంతో మిల్లుల వద్దే నిల్వ ఉంచడం వల్ల కూలీలకు అదనంగా రెండు, మూడు పర్యాయాలు కూలి చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ధాన్యం, బియ్యం ఎగుమతులు, దిగుమతులు, రవాణా చార్జీలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా నేటికీ చెల్లించలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైస్‌ మిల్లింగ్‌ ఇండస్ట్రీ వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో మిల్లింగ్‌ వ్యవస్థ ఏవిధంగా పని చేస్తుందోనని, ఈ ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు, బిల్లులు ఏవిధంగా వస్తాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్‌మిల్లర్ల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నిధులు లేవని కరాఖండీగా చెప్పడంతో మిల్లర్లు అయోమయంలో పడ్డారు.