కొంప ముంచిన ఖరీఫ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొంప ముంచిన ఖరీఫ్

కర్నులు, అక్టోబరు 23, (way2newstv.com)
ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగా వేసిన దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరోగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో గ్రామాల్లో కూలీల వలసలు ఊపందుకున్నాయి. స్థానికంగా పనులు లేకపోవడంతో పొట్ట కూటి కోసం కూలీలు సుగ్గి బాట పట్టారు. పశ్చిమ ప్రాంత పల్లెల నుంచి రోజూ వందల సంఖ్యలో కూలీలు గుంటూరు పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళుతున్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగానికి చెందిన సహాయ గణాంక అధికారులు, వ్యవసాయశాఖకు చెందిన ఏఈవోలు, ఎంపీఈవోలు నిర్వహిస్తున్న పంటకోత ప్రయోగాల్లో ఈ విషయం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో ఖరీఫ్‌ దిగుబడులను అంచనా వేసేందుకు  పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 
కొంప ముంచిన ఖరీఫ్

సెప్టెంబరు నెలలో వివిధ మండలాల్లో భారీగా, మరికొన్ని మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావంతో ఆలస్యంగా సాగుచేసిన పంటల్లో 20 నుంచి 40 శాతం వరకు దిగుబడులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా..ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతులు ర బీలో శనగ, జొన్న వంటి పంటలు వేసుకోవడానికి భూములను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్థకం అయింది. రబీలో సాధారణ సాగు 3.50 లక్షల హెక్టార్లు ఉండగా శనగ 2.20 లక్షల హెక్టార్లలో సాగవుతోంది.  వరికి గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు చేస్తున్నందున 1,580 పంటకోత ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన పంటల్లో 666 పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తారు. వరిలో ఇంకా పంటకోత ప్రయోగాలు మొదలు కాలేదు. మిగిలిన పంటల్లో కొద్దిరోజులుగా దిగుబడులను అంచనా వేస్తున్నారు.  ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు 6,35,327 హెక్టార్లు ఉండగా జూన్, జూలై నెలల్లో 3 లక్షల హెక్టార్ల వరకు సాగు చేశారు. తరువాత సాగు.. 6,24,897 హెక్టార్లకు పెరిగింది. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోవడంతో పలు గ్రామాల్లో దున్నేశారు. కొన్ని గ్రామాల్లో ఉన్నా..దిగుబడులు అసలు కనిపించలేదు. వేరుశనగతో పాటు కొర్ర, సజ్జ, మినుము పంటల్లో ఈ పరిస్థితి కనిపించింది.