విజయవాడ, అక్టోబరు 2, (way2newstv.com)
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. రాజకీయంగా ఎలాంటి మార్పులు ఎప్పుడు చోటు చేసుకుంటాయో కూడా ఊహించలేం. ఇప్పుడు అలాంటి పరిణామమే అధికార పార్టీ వైసీపీలోనూ చోటు చేసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని నమోదు చేసింది వైసీపీ. అయితే, ఎంత జగన్ సునామీ ప్రభావం ఉన్నప్పటికీ.. 23 స్థానాల్లో మాత్రం పార్టీ పల్టీ కొట్టింది. ఆయా నియోజకవర్గాల్లో కుప్పం, హిందూపురం వంటి కీలకమైన ఒకటో రెండో నియోజకవర్గాలను పక్కన పెడితే.. మిగిలిన చోట్ల పార్టీ గెలిచేందుకు అవకాశం ఉండి కూడా చిన్నపాటి కారణాలతో పార్టీ పరాజయం నమోదు చేసింది.ఈ పరిణామాన్ని తీవ్రంగా భావిస్తున్న జగన్ వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థి తిని చక్కదిద్దేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
23 నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జీలు
ఈ క్రమంలోనే ఆయన ఓడిపోయిన నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించుకుని, అక్కడి ఇంచార్జ్‌లను మార్చాలని తాజాగా నిర్ణయించుకున్న ట్టు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో గరటయ్య పోటీ చేశారు. అయితే, ఆయన ఓడిపోయారు. దీంతో ఇక్కడ ఇంచార్జ్‌ను నియమించాలని నిర్ణయించుకున్నారు గరటయ్య విషయంలో జగన్‌కు మంచి అభిప్రాయమే ఉంది. అయితే వయోవృద్ధుడు కూడా కావడంతో ఆయనను తప్పించాలని చూస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి స్ట్రాంగ్‌గా ఉన్న గొట్టిపాటి రవిని ఢీ కొట్టేందుకు మరో నేత కోసం అన్వేషణ జరుగుతోంది. అయితే అద్దంకి బాధ్యతలు కమ్మ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదే జిల్లా పరుచూరులో ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎర్త్ పెట్టారు. ఈయన స్థానాన్ని గతంలో ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన రావి రామనాథం బాబుకే తిరిగి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుననారు. ఇక రాజమండ్రి సిటీలో రౌతు సూర్యప్రకాశరావును తప్పించి శ్రీకాకొళపు శివరామ సుబ్రమణ్యంకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బాబ్జీని తప్పించి కౌరు శ్రీనివాస్‌కు పగ్గాలు అప్పజెప్పారు. బాబ్జీ వయస్సు పైబడడమే ఆయన్ను తప్పించడానికి ప్రధాన కారణం. కౌరు శ్రీనివాస్ గతంలో ఆచంట వైసీపీ సమన్వయకర్తగా పనిచేశారు.ఇక అదే జిల్లాలోని ఉండిలో సీవీఎల్ నరసింహరాజును తప్పించాలని చూస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు లేదా మరో నేతకు బాధ్యతలు ఇవ్వనున్నారు. విజయవాడలో తూర్పులో బొప్పన భవకుమార్ ఓడిపోయారు. ఈయనను తప్పించి యలమంచిలి రవికి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు పగ్గాలు వేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు ఈ క్రమంలోనే టెక్కలిలో పేరాడ తిలక్‌ను తప్పించి దువ్వాడ శ్రీనివాస్ కు ఇవ్వాలని చూస్తున్నారు.అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో తోట వాణిని తప్పించి గతంలో ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దవులూరి దొరబాబుకు ఇవ్వాలని చర్చ నడుస్తోంది. ఇక, రాజధాని జిల్లా గుంటూరు వెస్ట్‌లో చంద్రగిరి ఏసురత్నాన్ని తప్పించి లేళ్ల అప్పిరెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తంగా ఈ పరిస్థితిని గమనిస్తుంటే.. పార్టీకి జగన్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారనే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే పార్టీలో ఓడిపోయి యాక్టివ్ లేని వాళ్లతో పాటు ఇతరత్రా కారణాలతో మరికొందరిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు.