ప్రకాశం టూ ఐరోపా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశం టూ ఐరోపా

ఒంగోలు, అక్టోబరు 2, (way2newstv.com)
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారోత్పత్తులు, మనిషికి హాని చేయవు, మంచి చేస్తాయి. అదే విధంగా నేలకు మేలు చేస్తాయి. ప్రస్తుతం రైతులు విచ్చలవిడిగా వాడుతున్న క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల, భవిష్యత్తులో నేల ఆరోగ్యంతో పాటు మానవాళి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అలా పాడవకుండా ఉండడం కోసం,  భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించాలంటే, ప్రకృతి వ్యవసాయమే ప్రత్యామ్నాయం అని వ్యవసాయాధికారులు చెపుతున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు యూరప్‌ దేశాల్లో ఎక్కువ గిరాకీ ఉందని రైతులు వరి, మినుము, కొర్రలు, వరిగ, కంది, శనగ, మునగ, కరివేపాకు, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలతో పాటు యాపిల్‌రేగి, జామ పంటలను పూర్తిగా గోఆధారిత ప్రకృతి సేద్యం పద్ధతుల్లో పండించడం వల్ల ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించడం జరిగిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 
ప్రకాశం టూ ఐరోపా

సేంద్రియ పద్ధతిలో సాగు బాగుండడంతో, గత ఏడాది కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో 1100 ఎకరాల్లో ప్రకృతి వ్యసాయం చేశారు. ఈ సంవత్సరం 2 వేల ఎకరాల్లో ఈ పద్ధతి ద్వారా పలు రకాల పంటలను పండించేందుకు రైతులను సిద్ధం చేస్తున్నట్లు ఏఓ ప్రసాదరావు చెప్తున్నారు.ఎనిమిది అడుగుల ఎత్తు కలిగిన షేడ్‌నెట్‌లలో పండించిన ప్రకృతి ఉత్పత్తులకు విదేశీమార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. వీటిలో మిరప, ఉల్లి పంటలకు గిరాకీ అధికంగా ఉందని, పంటను కోసిన 24 గంటల లోపు విమానసర్వీసులు ఉన్న ప్రదేశాలకు తరలిస్తే వాటిని యురోపియన్‌ దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. కనుక రైతులు షేడ్‌నెట్‌లలో పంటలను పండించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు.అంతే కాకుండా మునగ ఆకును కూరగానూ, ఔషధాల తయారీలోనూ ఎక్కువగా వినియోగించడం వల్ల మునగ ఆకును కూడా విదేశాలకు తరలించేందుకు రైతులు ముందుకు రావాలని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన అల్లం, పసుపుకు కూడా మంచి గిరాకీ ఉండటంతో రైతులు విదేశాల్లో డిమాండ్‌ ఉన్న పంటలను ప్రకృతి సాగు ద్వారా పండించాలని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు.