శ్రీకాకుళం, అక్టోబర్ 25 (way2newstv.com):
రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ రాయితీ బకాయిలను చెల్లించకపోవడంతో రైతన్న వడ్డీ భారాన్ని మోయాల్సి వస్తోంది. రైతు తరఫున కొన్ని బ్యాంకులు వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ.. కొన్ని బ్యాంకులు ససేమిరా అంటూ వడ్డీతో సహా జమ చేయించుకోవడంతో ఆ మేరకు రైతుకు భారంగా మారుతోంది. జిల్లాలోని బ్యాంకులకు దాదాపు రూ.120 కోట్ల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వడ్డీ బకాయిలు రావాలి. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తే రైతులకు కొంత ఉపశమనం చేకూరుతుంది.వాస్తవానికి పంట రుణాలపై రైతు చెల్లించాల్సిన వడ్డీ 11.5 శాతం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందులో 2.5 శాతం వడ్డీని రుణం సమకూర్చిన బ్యాంకులే రాయితీ కల్పిస్తాయి.
రైతుపై వడ్డీ భారం (శ్రీకాకుళం)
ఎలాంటి నిబంధన లేకుండా కేంద్ర ప్రభుత్వం మరో 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. చెల్లింపు గడువుతో సంబంధం లేకుండా ఈ రెండు శాతాన్ని కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా రైతుకు ఇస్తుంటుంది. మిగిలిన ఏడు శాతంలో .. మరో 3 శాతం కేంద్రం, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించి అన్నదాతకు వడ్డీలేని రుణాలుగా అప్పులిస్తాయి. గడువులోపల సకాలంలో చెల్లిస్తే ‘ఇన్సెంటివ్ ఫర్ ప్రామ్ట్ పేమెంటు’ కింద ఈ మూడు శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. అంటే. మొత్తంగా కేంద్రం 5శాతం వడ్డీ రాయితీని సమకూరుస్తుంది. ఏడాదిలోపు చెల్లిస్తే మొత్తం 5శాతం రాయితీ వర్తింపజేస్తుంది. ఏడాది లోపు చెల్లించకపోతే ఈ మూడు శాతం సర్దుబాటు కాదు. కేవలం రెండుశాతమే వర్తింపజేస్తుంది. జిల్లాల్లోని బ్యాంకులు మొత్తం ఎంతమందికి ఎంత మొత్తం రుణాలు ఇచ్చిందీ.. వారికి వర్తింపజేయాల్సిన వడ్డీకి సంబంధించి అర్ధ, వార్షిక నివేదికలను ఆయా బ్యాంకుల జోనల్ కార్యాలయాల నుంచి నేరుగా భారత రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ)కు పంపిస్తాయి. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆర్బీఐ పంపించేది. మూడేళ్లుగా నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు నివేదిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలకు.. అక్కడి నుంచి బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని జమ చేస్తే...ఆ తరువాత బ్రాంచిల్లో రైతుల ఖాతాలకు వడ్డీ మొత్తాన్ని జమ చేస్తుంటాయి. రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వడ్డీ సొమ్ములు సర్దుబాటు కావడం లేదు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రాయితీ ఆ మరుసటి ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే ప్రభుత్వాలు సర్దుబాటు చేయాల్సి ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలకు సంబంధించి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మొదట్లో సర్దుబాటు కావాలి. ఇలా ప్రభుత్వాలు వడ్డీ మొత్తాన్ని సర్దుబాటు చేయకపోవడంతో ఆ భారం ప్రత్యక్షంగా తమపై పడుతోందని రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.జిల్లాలో ఈ ఏడాది పంట రుణాల కింద రూ.2,574 కోట్ల మేర రైతులకు అందించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో అత్యధిక వాటా ఆంధ్రాబ్యాంకు, ఎస్బీఐ, ఏపీజీవీబీ, డీసీసీబీలదే. ఈ నాలుగు బ్యాంకులే ఏటా రూ.2 వేల కోట్ల వరకు పంట రుణాలు అందిస్తున్నాయి. ఈ ఏడాది రుణం ప్రణాళిక మేరకు అందిస్తే.. ఏడు శాతం రాయితీ కింద దాదాపుగా రూ.180 కోట్ల వరకు రైతులకు మేలు చేకూరాల్సి ఉంటుంది. ఇలా గత రెండేళ్లుగా జిల్లాకు రావాల్సిన బకాయిలు రూ.120 కోట్ల వరకు పేరుకుపోయాయి. డీసీసీబీకి 2017-18కి సంబంధించి ఇంకా వడ్డీ రాయితీ జమ కాలేదు. గతేడాదికి సంబంధించి మాత్రం ఇటీవలే రూ.4.80 కోట్లు అదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. జిల్లాలో పంటరుణాల పంపిణీలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఒక్కో బ్యాంకుకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జమ చేయడం ఆలస్యమైనప్పటికీ.. ఆయా బ్యాంకులు తమ సొంత నిధులను వడ్డీకింద జమ చేయగలిగితే అన్నదాతకు కొంత ఊరట చేకూరుతుందని కర్షకుల మాట.