ట్రంప్ కు ప్రచారంపై విమర్శల వేడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రంప్ కు ప్రచారంపై విమర్శల వేడి

న్యూఢిల్లీ, అక్టోబరు 3 (way2newstv.com)
ప్రధాని మోడీ ఇటీవల అమెరికా పర్యటన విజయవంతమైంది. గత నెలాఖరులో వారం రోజుల పాటు అగ్రరాజ్యాన్ని సందర్శించిన ఆయన ఊపిరిసలపని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూయార్క్ వేదికగా జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్ పై భారత్ వాణిని బలంగా వినిపించారు. అదే వేదికగా పాక్ దుర్నీతిని ఎండగట్టారు. టెక్సాస్ రాష్ట్రంలో, హ్యూస్టన్ నగరంలో జరిగిన హౌడీ – మోడీ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన సుమారు 50వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం మంత్ర ముగ్దులను చేసింది. ఆయన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హాజరవడం విశేషం. అనేకమంది కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, అమెరికా ప్రముఖులు హాజరయ్యారు.
ట్రంప్ కు ప్రచారంపై విమర్శల వేడి 

మోడీ హ్యూస్టన్ సమావేశం విజయవంతమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రసంగం మధ్యలో వచ్చే ఏడాది ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించాలని పిలుపు ఇవ్వడంపై రాజకీయ, దౌత్యరంగాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అబ్ కీ బార్ ట్రంప్ అని మోడీ పిలుపు నివ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు ముందుగానే నిర్ధేశిత మై ఉంటాయి. అధికారికమైన ప్రోటోకాల్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. విందులు, వినోదాలు, చర్చలు, సంప్రదింపులు, సంయుక్త ప్రకటనలు, విలేకరుల సమావేశాల వంటి కార్యక్రమాలుంటాయి. ఎక్కడ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ముందుగానే ఎజెండా తయరావుతుంది. అంతకు మించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడరు. వీలైనంత తక్కువగా ముక్తసరిగా విలేకరులతో మాట్లాడుతారు. అంతర్గతంగా ఏమున్నప్పటికీ అస్సలు బయటపడరు. తక్కువ మాటలతో ఎక్కువ అర్థం స్పూరించేలా వ్యవహరిస్తారు.ఆ మాటల అంతరార్ధాన్ని పసిగట్టడం అంచనా వేయడం ఒకింత కష్టమే. కానీ మోదీ అంచకు భిన్నంగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. ట్రంప్ ను మళ్లీ గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం వివిధ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. దీనివల్ల ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేయడం ఖాయం. ఆయన గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా డెమొక్రటిక్ అభ్యర్థి గెలిస్తే ఇరు దేశాల సంబంధాలపై మోడీ ప్రసంగ ప్రభావం పడే ప్రమాదం ఉంది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడితో సంబంధాలు సాగించడం కష్టమవుతుంది. సాధారణంగా ప్రవాస భారతీయులు సంప్రదాయంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతు దారులు రిపబ్లికన్లకూ దూరం. మోడీ వ్యాఖలు ఆ దేశరాజకీయాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుంది. విదేశాల్లో ఎన్నికలపై ఆసక్తి కనబరచడం సహజమే. అదే సమయంలో తెరవెనక ఒక వ్యక్తి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా పావులు కదపడం కూడా సహజమే. అయితే బహిరంగ ప్రకటనలకు భారతీయనేతలు దూరంగా ఉండేవారు.ఇటీవల ఇజ్రాయిల్ ఎన్నికల్లో ‘లికుడ్’ పార్టీని భారత్ బలపరించింది. ఆ పార్టీ అభ్యర్థి బెంజిమన్ నెతన్యాహూ ఓడిపోవడం గమనార్హం. 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు మహింద్రరాజు పక్సే కు వ్యతిరేకంగా భారత్ పావులు కదిపింది. రాజపక్సే ప్రత్యర్థి మైత్రిపాల సిరిసేనకు అనుకూలంగా వ్యవహరించింది భారత్. నాటి ఎన్నికల్లో సిరిసేన గెలిచారు. అదే రాజపక్సే గెలిచి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న కొత్త ఢిల్లీ, కొలంబో సంబంధాలు మరింత దెబ్బతినేవి. తాజాగా హ్యూస్టన్ సమావేశాలు ట్రంప్ ను గెలిపించాలంటూ మోడీ పిలుపునివ్వడం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదు. వాస్తవానికి ట్రంప్ హయాంలో భారత్ కు గానీ, ప్రవాసభారతీయులకు గానీ ఒరింగిదేమీలేదు. అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ వలసలు, ఉద్యోగులు, హెచ్.ఐ.బి వీసాలపై తీసుకున్న నిర్ణయాలు ప్రకంపనలు సృష్టించాయి. ఉద్యోగులు, చదువులు మానుకుని కొంతమంది భారత్ కు తిరిగివచ్చారు. భారత్ కు వస్తే తిరిగి వెళ్లలేమన్న ఉద్దేశ్యంతో కొందరు అక్కడే ఉండి పోయారు. కనీసం బంధువుల ఇళ్లల్లో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు సైతం గైర్హాజరయ్యారు.ఇక భారత్ పరంగా కూడా ట్రంప్ ఒరగబెట్టిందేమిలేదు. దేశీయ కంపెనీల రక్షణపేరిట తీసుకున్న నిర్ణయాలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికాకు దిగుమతి అయ్యే ఉక్కు, అల్యుమినియం ఉత్పత్తులపై భరోసా సుంకాలు పెగిగాయి. 2018-19 లో అమెరికాకు మన ఎగుమతుల విలువ రూ. 52, 406కోట్లు, అక్కడ నుంచి మన దిగుమతుల విలువ రూ.35, 549 కోట్లు. ఇక మోడీ టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరాన్ని తన సమావేశానికి ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. మెక్సికో సరిహద్దుల్లో ఉండే టెక్సాస్ రాష్ట్రంలో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరు చాలా కాలంగా డెమొక్రటిక్ పార్టీకి మద్దతుదారులు. ఈ దఫా ఎన్నికల్లో వారిని రిపబ్లికన్ల వైపు మళ్లించాలన్నదే మోడీ ఆలోచన. అందుకే వ్యూహాత్మకంగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాటికన్ సిటీ అధినేత పోప్ తరువాత అమెరికాలో ఓ విదేశీ అధినేత సభకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం ఇదే ప్రధమమని స్థానిక అమెరికన్లు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మోడీ ఓ దుస్సంప్రదాయానికి తెరతీశారన్న భావన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిని ఎవరూ తోసిపుచ్చలేరు.