నిజామాబాద్, అక్టోబరు 30, (way2newstv.com)
ఖరీఫ్ సీజనులో రైతులు పండించిన సన్న ర కం వరి ధాన్యానికి కొనుగోలు కేం ద్రాల్లో ఆశించిన ధర లేకపోవడం తో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా ఆచరణలో విఫలం అయ్యింది. దీంతో సన్న రకాలకు ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు కాలేదు. మార్కెట్‌లో సన్న రకాలకు ఉన్న ధరను గుర్తించి ప్రత్యేక కౌంటర్‌ల ద్వారా సేకరించి రైస్‌మిల్లర్లకు తామే విక్రయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఏ సీజనులోను సన్న రకాల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం విక్రయించడానికి వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు.
సన్న రకానికి దొరకని మద్దతు ధర
గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాల్లోని రైతులు దాదాపు రూ.3 కోట్ల వరకు కోల్పోయారు. జిల్లాలో దాదాపు 92 వేల హెక్టార్‌లలో వరి సాగైంది. ఇందులో 60 శాతం వరకు సన్న రకాలనే పండించారు. బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. ఎక్కువ మంది తమ భోజనంలో సన్న రకం బియ్యం తినడానికి ఆసక్తిని చూపడంతో రైతులు కూడా సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. రబీ సీజనులో పూర్తిగా దొడ్డు రకాలనే సాగు చేయడం వల్ల ఖరీఫ్‌లో సన్న రకాల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. సన్న రకాలకు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘ఎ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,770, ‘బి’ గ్రేడ్ రకానికి రూ.1,750 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలకే ఎ గ్రేడ్ ధరను వర్తింప చేస్తున్నారు. సన్న రకాలకు మాత్రం బి గ్రేడ్ ధరను కల్పిస్తున్నారు. దీంతో సన్న రకాలను సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించకుండా వ్యాపారులు, రైస్ మిల్లర్లకే అమ్మాల్సి వస్తోంది. కాగా వ్యాపారులు, రైస్ మిల్లర్ల ద్వారా మోసాలకు గురికాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే సన్న రకాలకు కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధర వర్తించడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది.