మహామణిమండపశోభితుడు
కట్టెదుట వైకుంఠము కాణాచయిన కొండ... తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ... - అని అన్నమయ్య ప్రస్తుతించిన తిరుమల ఆలయంలో వెలసిన వివిధమండపాల శోభను పరిశీలిస్తేస్వామివారికి వివిధములైన ఉత్సవసందర్భాల్లో అవి ఎలా ఉపయుక్తమౌతున్నాయో విశదమౌతుంది.
ప్రతిమామండపంలో :
మహాద్వారంనుండి లోపలికి ప్రవేశించగానే 16 స్తంభాలతో కృష్ణదేవరాయ మండపం (ప్రతిమామండపం)లో విజయనగర శిల్పసంప్రదాయం ఉట్టిపడేలా ఉంటుంది. ఈ మండపంలోదక్షిణభాగాన కృష్ణదేవరాయలు, ఆయన దేవేరులు, తిరుమలదేవి-చిన్నాదేవి అంజలి ఘటిస్తున్నట్లున్న నిలువెత్తు రాగివిగ్రహాలు కన్పిస్తాయి.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం
మలయప్పస్వామి తిరుమల మాడవీధుల్లోసంచరించి లోపలికి వచ్చి ఈ ప్రతిమామండపంలోనే కొంతసేపు విశ్రమిస్తారు. ఇక్కడే ఆచార్యపురుషులు దివ్యప్రబంధగానం చేస్తారు.
అద్దాలమండపంలో :
ప్రతిమామండపానికి ఉత్తరదిక్కున ఎత్తైనప్రదేశంలో అద్దాలమండపం (అయినామహల్) ఉంది. అందులో డోలోత్సవానికిగాను గొలుసులు వేలాడదీయబడి ఉన్నాయి. ఊయలలోఊగేటప్పుడు స్వామివారు అద్దాలలో అన్నివైపులా ప్రతిబింబిస్తారు. ఇక్కడ నిత్యం డోలోత్సవం జరుగుతుంది. క్రీ.శ.1831 నాటికే ఈ మండపముంది.
రంగమండపంలో :
రంగమండపమనబడే రంగనాయకమండపం అద్దాల మండపానికి ఎదురుగా ఎత్తైన రాతి స్తంభాలతో ఉంది. క్రీ.శ. 1320-60 మధ్య శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలోరక్షింపబడి పూజలందుకొన్నారు. ప్రస్తుతం దీన్ని వాహనమండపంగా ఉపయోగిస్తున్నారు. బ్రహ్మూత్సవసమయాల్లో స్వామివారు ఇక్కడే పూజానైవేద్యాలు అందుకొంటారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు ఇక్కడే జరిగేవి. ప్రముఖులకు వేదపండితుల ఆశీర్వచనాలు కూడా ఇక్కడే ఇస్తారు. పట్టపువాహనమైన బంగారుశేషుడు చుట్టచుట్టుకొని ఇక్కడ దర్శనమిస్తాడు.
తిరుమలరాయమండపంలో :
రంగమండపాన్ని ఆనుకొని ఉన్న ధ్వజస్తంభమండపానికి 10 అడుగుల దూరంలో తిరుమలరాయమండపం నెలకొని ఉంది. క్రీ.శ.1473లో సాళువ నరసింహరాయలు ఈ మండపంప్రతిష్ఠించారు. ఇక్కడ హంసతూలికాతల్పంలో స్వామివారు ఉభయనాంచారులతో ఊగుతారు. 16వశతాబ్దంలో తిరుమలరాయలు దీనిని విస్తరింపజేసి ఏటా వసంతోత్సవం జరిపేఏర్పాటు చేశాడు. బ్రహ్మూెత్సవాల్లో ధ్వజారోహణవేళ స్వామివారు ఈ మండపంలోకి వేంచేస్తారు.
ధ్వజస్తంభ మండపంలో :
ఈ మండపాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం బంగారు ధ్వజస్తంభంపై గరుడాళ్వారు ధ్వజపటం ఎగురవేయడంతో జరుగుతుంది.వదలక వలసిన వారికి వరములు ఎదురెదురైతానిచ్చును..... నిదురలేక పెనునిధానమై కదలడదె గరుడ గంభముకాడ..... - అంటాడు అన్నమయ్య.
నాలుగుకాళ్లమండపంలో :
తిరుమలరాయమండపానికి పడమరగా సంపంగి ప్రదక్షిణలో ఆగ్నేయమూలగా నాలుగుకాళ్లమండపాలున్నాయి. పూర్వము స్వామివారు ఇక్కడికే వేంచేసేవారు. క్రీ.శ.1470లోసాళువనరసింహరాయలు తన కుటుంబసభ్యులపేర దీనిని నిర్మించాడు. 'ఉట్లపండుగ' నాడు క ష్ణస్వామి ఇక్కడ వేంచేపు చేసి పూజలందుకొంటాడు. దీనినే 'శిక్యోత్సవ'మంటారు. ఎక్కెనుశ్రీవేంకటాద్రి ఇదివో మన కృష్ణుడు.... చక్కనాయ, పనులెల్లా చాలించిరారో.... అంటాడు అన్నమయ్య.
కల్యాణమండపంలో :
సంపంగిప్రదక్షిణకు దక్షిణంవైపున దీర్ఘచతురస్రాకారంలో నిత్యకల్యాణం పచ్చతోరణానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది శ్రీవేంకటరమణస్వామి కల్యాణ మండపం. ఇక్కడే రోజూఆర్జితసేవలకింద కల్యాణోత్సవం జరుపుతారు. కొన్నేళ్లక్రితం ఇది రంగమండపంలో జరిగేది. పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం కూడా ఇక్కడే ఏటా జరుపుతారు.
మహామణిమండపంలో :
ఆనందనిలయంలోకి ప్రవేశించగానే మహామణి మండపం బంగారు వాకిలికి గరుడమందిరానికి మధ్య ఉంది. దీనినే ఘంటామండపం, ముఖమండపం అని కూడా పిలు స్తారు. ఇక్కడ నాలుగువరుసల్లో 16 స్తంభాలున్నాయి. క్రీ.శ. 1417లో విజయనగరసామ్రాజ్య మంత్రి మల్లన దీనిని నిర్మించారు. ఈ స్తంభాలపై వరాహస్వామి, న సింహస్వామి, మహావిష్ణువు, వేంకటేశ్వరస్వామి, వరదరాజస్వామి శిల్పాక తులు దర్శనమిస్తాయి.ఈ మండపంలో నిత్యం ప్రాతఃకాలాన మూడు గంటలవేళ సుప్రభాత పఠనం చేస్తారు. కొలువు, పంచాంగ శ్రవణం, ఆదాయవ్యయ నివేదన ఇక్కడే చేస్తారు. బుధవారం ఉదయం సహస్రకలశాభిషేకం, గురువారం అన్నకూటోత్సవం (తిరుప్పావడ) జరుపుతారు. ఇది స్వామివారి ఆస్థానమండపం.ఈ మండపానికి (బంగారువాకిలికి) దక్షిణాన రెండు పెద్దగంటలు చెక్కదూలానికి - పెద్ద ఇనుపగొలుసులతో వేలాడ దీయబడి ఉంటాయి. స్వామివారికి నివేదనసమయంలో వీటిని మోగిస్తారు. ఇదే ఘంటామండపం. దీనినే తిరుమామణి మండపం అని కూడా పిలుస్తారు. తమిళంలో 'మణి' అంటే గంట అని అర్థం.
స్నపనమండపంలో :
బంగారువాకిలి లోపల చతురస్రాకారంలో కనిపించేదే స్నపనమండపం. నాలుగుస్తంభాలపై బాలక ష్ణుడు, యోగనరసింహుడు, శ్రీక ష్ణుని కాళీయమర్దనులు చెక్కబడ్డాయి. దీనిని తమిళంలో తిరువిలాన్కోయిల్ అంటారు. క్రీ.శ. 614లో పల్లవ రాణి సమవాయి(పెరుందేవి) వెండి భోగశ్రీనివాసమూర్తిని బహూకరించి ఈ మండపంలో అభిషేకాదులు జరిగేలా కట్టడి చేసింది.ప్రస్తుతం ఏ విధమైన అభిషేకాదులు లేవు ఇక్కడ.
శయనమండపంలో :
రాములవారి మేడ దాటగానే కన్పించేదే శయన మండపం. ఇక్కడ రోజూ రాత్రివేళ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతసేవ జరుపుతారు. వెండిగొలుసులతోనున్న బంగారు పట్టె మంచంపైస్వామివారిని పరుండజేస్తారు. అన్నమయ్య వంశీకుడు అన్నమయ్యలాలి పాడుతారు. సుప్రభాతం తర్వాత తోమాల సేవలసమయంలో దివ్యప్రబంధగానాన్ని చేస్తారు. సహస్రనామపఠనం, వేదపఠనం ఇక్కడే జరుగుతాయి. ఆర్జిత సేవాభక్తులు ఇక్కడ కూర్చొని స్వామిని వీక్షిస్తారు.వెండివాకిలికి దక్షిణదిశలో అంకురార్పణ మండపం, పరకామణి మండపం ఉన్నాయి. విమానవేంకటేశ్వరుని దర్శించి,హుండీలో కానుకలు సమర్పించి రాగానే యోగనారసింహుని ప్రదక్షిణమండపం కన్పిస్తుంది. అంకురార్పణమండపంలో బ్రహ్మోత్సవాలకు ముందు బీజావాపం అనేవైదికప్రక్రియ జరుగుతుంది. ఈ మండపాలకు తోడుగా గొల్లమండపం, పారువేట మండపం, ఆస్థానమండపం, సహస్రదీపాలంకరణసేవాకొలువు మండపం, వసంతోత్సవ మండపం, వాహనమండపం, నాదనీరాజన మండపం తిరుమలకు విచ్చేసిన భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇనుమడింప జేస్తాయి.