ప్లేట్ లెట్స్ 14 వేలు
ఏలూరు, అక్టోబరు 18, (way2newstv.com)
జిల్లాలో డెంగీ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోవటంతో రోగులు ప్రాణాపాయస్థితికి చేరుతున్నారు. జిల్లాలో డెంగీ బాధితులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి రోగులను తీసుకువచ్చినా వైద్యం చేసే పరిస్థితి కనిపించటంలేదు. మెడికల్ సూపరింటెండెంట్, వైద్య అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్స్ లేవని, తామేమీ చేయలేమని రోగుల బంధువులకు చెప్పటంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకువెళ్ళలేని పేదవర్గాలప్రజల ప్రాణాలకు భరోసాలేని దుస్థితి నెలకొంది.
గోదావరి జిల్లాలను వేధిస్తున్న డెంగీ
వైద్య అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు కానరావటం లేదు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు తూతూ మంత్రంగానే చికిత్స చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.జిల్లా వ్యాప్తంగా ఆయా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, వివిధ వ్యాధులకు సంబంధించి ఆపరేషన్ల సందర్భంలోనూ రోగి ప్రాణాలు రక్షించేందుకు ప్రాణాధారం రక్తమే. కానీ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధుల్లో రక్త నిల్వలు లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక నెలకు సుమారుగా 5000యూనిట్ల వరకూ రక్త నిల్వలు అవసరం అవుతాయని అంచనా. కానీ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు, ఇతర దాతల ద్వారా సేకరించిన రక్త నిల్వలు 3000యూనిట్ల వరకూ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇక డెంగీ వంటి వ్యాధుల బారిన పడిన రోగికి అత్యవసరంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోవటంతో రక్తం అవసరం అవుతుంది. కానీ రక్త దాతలనుంచి రక్తం సేకరించేందుకు శ్రమించాల్సి వస్తోంది. రక్తాన్ని స్వీకరించటానికి వివిధ నిబంధనలు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కష్టంగా మారుతోంది.ప్రభుత్వ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు మినహా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్స్ కావాలంటే భారీగా సొమ్ములు చెల్లించాల్సిందే. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఏకంగా ఒక ప్యాకెట్ ప్లేట్‌లెట్స్ కోసం రూ.12వేల నుంచి రూ.16వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో కనీసం నామమాత్రంగా అయినా రక్తనిల్వలు లేని దుస్థితి నెలకొంది. రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో మాత్రమే రోగులకు కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. డెంగీ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్‌లెట్స్ కౌంట్ డౌన్ అయితే మాత్రం విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయటం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో పెద్దగా బ్లడ్ బ్యాంకులు లేకపోవటం, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లోని సిబ్బందిలో చిత్తశుద్ధి లోపించటంతో మాకేంటీ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ఉండగా, రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులు ఏలూరు, తణుకు, నరసాపురంలో ఉన్నాయి. వీటికి అనుసంధానంగా స్టోరేజీ పాయింట్లు పాలకొల్లు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమడోలు, చింతలపూడిలో ఏర్పాటు చేశారు. ఇక ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఉండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి.