అకాల కష్టం.. (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అకాల కష్టం.. (నిజామాబాద్)

నిజామాబాద్ అక్టోబర్ 29 (way2newstv.com):
అకాల వర్షాలు అన్నదాత వెన్ను విరిచాయి. ఎన్నో ఆశలతో పండించిన పంట చేతికొచ్చి అమ్ముకుందామనే సరికి ధర ఢమాల్‌మన్నది. వరుస వానలతో కోసిన పంటను ఆరబెట్టుకునే వీలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నిల్వ చేసుకోలేక, తక్కువ ధరకు అమ్ముకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. కల్లాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ రోడ్లపైనే ఎండబోస్తున్నారు. కొంత గింజ రంగు మారడంతో కూడా డిమాండ్‌ పడిపోయింది. నాలుగైదు రోజులుగా వర్షం పడడంతో ధాన్యం దెబ్బతినకుండా కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే అదనుగా వ్యాపారులు అడ్డగోలుగా ధర తగ్గించేశారు. 
అకాల కష్టం.. (నిజామాబాద్)

వాస్తవానికి ప్రభుత్వ మద్దతు ధర కంటే కూడా ఈసారి బహిరంగ విపణిలోనే ఎక్కువ ధర ఉండడంతో మొక్కజొన్న, మినుము, సోయాబీన్‌, ధాన్యం పంటలను దర్జాగా అమ్ముకోవచ్చనే ధీమా ఇప్పుడు నీరుగారిపోయింది. మొక్కజొన్న సర్కారు మద్దతు ధర క్వింటాలుకు రూ.1,760. గతేడాది రూ.1,700. వినియోగం సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఏడాదిన్నర కాలంగా క్వింటాలుకు రూ. 2 వేల పైనే కొనసాగుతోంది. ఒకానొక దశలో 2,400 వరకు వెళ్లింది. ఈ సీజన్‌ మొదట్లోనూ రూ. 2,200 వరకు ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోసిన పంట ఆరబెట్టడం రైతులకు సాధ్యం కావడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉంటుందనే కారణంతో క్వింటాల్‌ రూ. 200-400 తగ్గించేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌ యార్డులో సగటున రూ.1,800 వస్తోంది. పచ్చి మక్కలైతే రూ.1,200 పలుకుతున్నాయి. ఈ సీజన్‌లో60,870 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఇప్పుడు అమ్ముకుందామంటే అవస్థలు పడుతున్నారు.జిల్లాలో సోయాబీన్‌ సాగు క్రమంగా తగ్గుతోంది. చీడపీడలను తట్టుకోలేక, దిగుబడుల రాక, గిట్టుబాటు ధర అందక అన్నదాతలు మొహం చాటేస్తున్నారు. ఈ సీజన్‌లో 80,281 ఎకరాల్లో పంట వేశారు. ఈసారి పంటకు పురుగులు, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం ఎదురయ్యింది. అన్నింటిని తట్టుకుని బాగా వచ్చిందనుకునే సరికి నూర్పిడి సమయంలో అకాల వర్షాలు దెబ్బతీశాయి. దీంతో మద్దతు ధర కంటే ఎక్కువ అందుతుందని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురైంది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.3,710గా ఉంటే ఇప్పుడు మార్కెట్‌లో 3,340 మాత్రమే వస్తోంది. ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో వరి 2.67 లక్షల ఎకరాల్లో సాగైంది. మంచి దిగుబడులు వస్తున్నాయనుకునేలోపే వర్షాలతో పంట నేలవాలింది. గింజ దెబ్బతింటుందనే భయంతో రైతులు వెంట వెంటనే కోత యంత్రాలతో నూర్పిడి చేసి కల్లాల మీదే విక్రయిస్తున్నారు. మద్దతు ధర క్వింటాల్‌కు (ఏ-గ్రేడ్‌) రూ.1,835 రావాలి. తేమ ఎక్కువ ఉండడంతో మార్కెట్‌లో రూ.1,400 అమ్ముకోక తప్పడం లేదు.సోయాబీన్‌ పంటను మార్క్‌ఫెడ్‌ సంస్థ ఉభయ జిల్లాల్లో నిజామాబాద్‌, కామారెడ్డి, గాంధారి, ఆర్మూర్‌లలో ఐడీసీఎంఎస్‌ ద్వారా సేకరిస్తోంది. ఈ కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పటికీ ఇప్పటివరకు పెద్దగా కొన్నది లేదు. నిజామాబాద్‌ యార్డులో ఒక బస్తా కూడా కొనలేకపోయారు. దీనికి ప్రధాన కారణం తేమ 12 శాతం కంటే ఎక్కువ ఉండడమేనని తెలుస్తోంది. పంటను ఆరబెట్టుకుని వచ్చేందుకు కొంతమంది కల్లాల వద్ద రాశులు పోసి అలాగే ఉంచుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితేగానీ పంట మార్కెట్‌కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.