తొలిసారిగా ఎన్నికల్లోకి ధాక్రే కుటుంబం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తొలిసారిగా ఎన్నికల్లోకి ధాక్రే కుటుంబం

ముంబై, అక్టోబరు 3 (way2newstv.com)
శివసేన ఎన్నడూ లేనిది కొత్త ప్రయోగానికి దిగుతోంది. పార్టీలో కొత్త ఒరవడికి ఉద్ధవ్ థాక్రే శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ శివసేన వ్యవస్థాపకుడైన బాల్ థాక్రే కుటుంబం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన పార్టీని కేవలం నడిపించారు. శివసేనను మహరాష్ట్రలో బలోపేతం చేయడంపైనే బాల్ థాక్రే దృష్టి పెట్టారు తప్ప ఆయన ఎప్పుడూ పదవుల కోసం వెంపర్లాడ లేదు. తాను పార్టీని శాసిస్తున్నా ఆయన మాత్రం పోటీకి దూరంగానే ఉన్నారు. తనను విశ్వసించిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు తప్ప థాక్రే కుటుంబం మాత్రం పదవుల కోసం పోటీ పడలేదు.ఇక బాల్ థాక్రే మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే కూడా పార్టీ అధినేతగానే ఉన్నారు. ఆయన కూడా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 
 తొలిసారిగా ఎన్నికల్లోకి ధాక్రే కుటుంబం

ముంబయిలో కూర్చుని ఢిల్లీ రాజకీయాలను శాసించే ఉద్ధవ్ థాక్రే ఎన్నడూ నామినేషన్ వేయలేదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ ఉద్ధవ్ థాక్రే తన సత్తా చాటారు. బీజేపీతో పొత్తుతో వెళ్లి పద్ధెనిమిది లోక్ సభ స్థానాలను శివసేన కైవసం చేసుకుంది. ఇలా థాక్రే కుటుంబం పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తప్ప తాము ఎన్నికల బరిలో నిలవలేదు.బాల్ థాక్రే మాదిరిగానే ఆయన తనయుడు ఉద్ధవ్ థాక్రే అదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వారసుడు ఆదిత్య థాక్రే మాత్రం రాజకీయాల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకున్నారు. ఇటీవలే ఆదిత్య థాక్రే పాదయాత్ర కూడా చేశారు. యువకుడు కావడం, తండ్రి, తాతల వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంతో ఆయన సులువుగా రాజకీయాల్లో రాణించగలరని భావించారు. ఉద్ధవ్ థాక్రే తర్వాత శివసేన పగ్గాలు పట్టేది ఆదిత్య థాక్రే అన్నది అందరికీ తెలిసిందే.అయితే తాత, తండ్రి సంప్రదాయాలకు ఆదిత్య థాక్రే ఫుల్ స్టాప్ పెట్టేశారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆదిత్య థాక్రే రెడీ అయిపోయారు. ధాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సభ్యుడిగా ఆదిత్య థాక్రే రికార్డు సృష్టించనున్నారు. 53 ఏళ్ల శివసేన ప్రస్థానంలో ఎన్నడూ జరగనిది ఆదిత్య థాక్రే చేశారు. ఆదిత్య థాక్రే వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వర్లి నియోజకవర్గం శివసేన పార్టీకి కంచుకోట. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి విజయం సాధిస్తే ఆదిత్య థాక్రే సీఎం అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇప్పటికే రెండున్నరేళ్ల పదవీకాలాన్ని బీజేపీ, శివసేనలు పంచుకున్న సంగతి తెలిసిందే. థాక్రే కుటుంబం చేస్తున్న తొలి ప్రయోగం ఫలిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.