వణుకుతున్న జనం (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వణుకుతున్న జనం (అనంతపురం)

అనంతపురం, అక్టోబర్ 26   (way2newstv.com): 
విష జ్వరాలతో జిల్లా గజగజ వణుకుతోంది. ప్రతి పల్లె...పట్టణంలోనూ విష జ్వరాలే. మునుపెన్నడూ లేనివిధంగా జనాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. అబ్భా..అమ్మా అంటూ ముక్కుతూ మూలుగుతూ మంచాన పడ్డారు. చిన్నారులు.. వృద్ధుల పరిస్థితి వర్ణాణాతీతం. ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడ్డారు. దినకూలీ పనులు.. చిల్లరకొట్టు వ్యాపారాలతో పొట్ట నింపుకొంటున్న బాధితుల దుస్థితి మరీ దయనీయంగా తయారైంది. కుటుంబంలో ఒకరికి విష జ్వరం సోకితే... ఇతర సభ్యులను కూడా వదలడం లేదు. ఒకరుపోతే ఒకరిని వేధిస్తున్నాయి. జలుబు... ముక్కులో కారే నీరుతో ఊపిరి ఆడకపోవడం... గజగజ వణికించే జ్వరం.. తలభారం.. ఒళ్లు,కీళ్లనొప్పులతో లేవలేక...నడవలేక సతమతం అవుతున్నారు. 
 వణుకుతున్న జనం (అనంతపురం)

ఈ తీరు జిల్లా అంతటా పాకింది. విష జ్వరాలు విజృంభించాయి. డెంగీ, మలేరియాతోపాటు... గన్యా జ్వరం చాపకింద నీరులా విస్తరిస్తోంది. జ్వర పీడితులతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజులతో పిండేసి సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారు.ఇటీవల కురిసిన వర్షాలతో వ్యాధులు కోరలు చాచాయి. అనంత సర్వజన వైద్యశాలలోనే కాదు... హిందూపురం, ఉరవకొండ, రాయదుర్గం, తాడిపత్రి, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, మడకశిర, గుంతకల్లు... వంటి ఆస్పత్రుల్లోనూ రోగుల తాకిడి తీవ్రమైంది. ఓపీ, ఐపీ రోగుల సంఖ్య రెట్టింపు కావడంతో పడకల కొరత ఏర్పడింది. విష జ్వరాలతో బాధపడే వారి సంఖ్యనే ఎక్కువైంది. డెంగీ, మలేరియా, గన్యా వంటి విష జ్వరాలు పిల్లలు, వృద్ధులను వదల్లేదు. అందుకే మెరుగైన చికిత్స కోసం అనంత సర్వజన ఆస్పత్రికి తరలి వస్తున్నారు. కొన్ని పీహెచ్‌సీల్లోనూ ఓపీ రోగుల సంఖ్య రెట్టింపు అయింది. ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్న పీహెచ్‌సీలల్లో ఈ దుస్థితి నెలకుంది. వైద్యులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. జిల్లాకు పెద్దదిక్కు అనంత సర్వజనాస్పత్రి. అందుకే నలుమూలల నుంచి ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడి పడకల సంఖ్య 500. రోజూ 1,194 మంది వైద్య చికిత్స పొందుతున్నారు. పిల్లలవార్డు, మెడిసిన్‌ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. జ్వర పీడితులు అమాంతం పెరిగారు. పిల్లల వార్డులో 60 పడకలే. మంచాలు వంద ఉన్నాయి. పిల్లలు మాత్రం 286 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి పడకపై ఇద్దరు ముగ్గురు తప్పనిసరి. కొన్ని పడకలపై నలుగురు కూడా ఉన్నారు. విధి లేక కొందరు చిన్నారులకు పడకలు లేకపోవడంతో కిందనే చికిత్స పొందుతున్నారు. ఇక్కడి చిన్నపిల్లల వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అదనంగా మంచాలు, నలుగురు వైద్యులు అవసరమని అక్కడి ప్రొఫెసర్‌ మల్లీశ్వరి వైద్య పర్యవేక్షకుడికి లేఖ పంపారు. నర్సులు, ఎల్‌టీల సమస్య కూడా ఉంది. తక్కువ ఉండటంతో వ్యాధి నిర్ధారణ, చికిత్స జాప్యం అవుతోంది.