ఇసుక వారోత్సవాలు...అక్కరకు వస్తాయా.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుక వారోత్సవాలు...అక్కరకు వస్తాయా....

విజయవాడ, అక్టోబర్ 31, (way2newstv.com)
ఇసుక వారోత్సవాలు…, ఇటుకల పక్షోత్సవాలు., సిమెంట్ మాసోత్సవాలు….. వ్యతిరేక వార్తలకు ముకుతాళ్లు… అసత్య కథనాలపై కేసులు... అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి బయటకొచ్చి మాట్లాడేది లేదు… ఆయనే మాట్లాడకపోతే మనకెందుకనుకునే మంత్రులు… వెరసి జనం ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి తెలీని గందరగోళం…. చాలా సార్లు తెలిసే చేస్తున్నారా..? తెలియక చేస్తున్నారా…? అధికారులు సహకరించక జరుగుతోందా…? ప్రతిపక్షంలో ఉండటానికి ప్రభుత్వాన్ని నడపడానికి మధ్య తేడా గుర్తించలేక జరుగుతోందా….ఝ ఇలా బోలెడన్ని సందేహాలు.ఏపీ సర్కారులో మంత్రుల సంఖ్య కంటే సలహాదారులే ఎక్కువయ్యారు. నచ్చిన వారిని రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏరికోరి సలహాదారులుగా చేర్చుకున్నారు. 
ఇసుక వారోత్సవాలు...అక్కరకు వస్తాయా....

వీరితో ఏం లాభమన్నది పక్కన పెడితే ఖజానాకు భారం మాత్రం తడిసి మోపెడవుతోంది. ఐదేళ్లలో అప్పులు, వడ్డీలు తప్ప ఏమి మిగల్చలేదని చెబుతూనే అప్పనంగా చెల్లించడం తప్ప పైసా ప్రయోజనం కనిపించడం లేదు. మొన్నా మధ్య పత్రికలు., టీవీలు, డిజిటల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై సంబంధిత శాఖాధిపతులే స్పందించేలా… అవసరమైతే కేసులు పెట్టాలని నిర్ణయించింది. దీనికి క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. దీంతో మీడియా పని అయిపోయినట్లే అని మంత్రులు., సలహాదారులు చంకలు గుద్దుకున్నారు. ఈ నిర్ణయంపై ఐఏఎస్‌ అధికారులు, శాఖాధిపతుల్లో విస్మయం వ్యక్తం అయ్యింది. మీడియాతో గొడవ పడటానికి తామేమీ రాజకీయ నాయకులు కాదని వాళ్లు తేల్చేశారు. విమర్శలు…. వివాదాలు రాజకీయ నేతల వంతని, ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నెరవేర్చడమే తమ పాత్ర అని, ప్రతి వార్తకు ఖండన, కేసులు అనుకుంటూ పోతే అసలు పని గాలికొదిలేయాల్సి వస్తుందని, ఇలాంటి సలహాలు ఇచ్చిన వాళ్లకే ఆ పని అప్పగించాలని సూచించారు. ఇంతకీ ఆ సలహా ఇచ్చింది ఎవరా అని అరా తీస్తే సచివాలయంలో అన్నీ తానే అనుకుంటోన్న ఓ అధికారి నిర్వాకంగా తేలింది. 2007లో వివాదాస్పద జీవో ఇచ్చినపుడే బోలెడు రచ్చ జరిగిందని, అనవసరంగా తేనె తుట్టె కదపొద్దని సూచించినా అర్దరాత్రి హడావుడిగా క్యాబినెట్ నోట్ తయారు చేయించినట్లు బయటకొచ్చింది. క్యాబినెట్ నిర్ణయంపై విమర్శలు రావడంతో కొత్త జీవో ఇవ్వకుండా వెనక్కి తగ్గారు.రాష్ట్రంలో ఐదు నెలలుగా ఇసుక దొరక్క జనం అల్లాడి పోతుంటే వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని మంత్రులు చెబుతున్నారు. మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్‌ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం ఇసుక తవ్వకాల మీదే. మూడు నెలల పాటు ఇసుక తవ్వకాలు బంద్ అని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించి సెప్టెంబర్‌ లో కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయం వెనుక కారణం అందరికీ తెలిసిందే. ఇసుక, మట్టి అమ్మకాలతో ఓ వర్గం బాగా లాభాపడిపోయిందని, రియల్ ఎస్టేట్‌, నిర్మాణ రంగం మొత్తాన్ని ఆ వర్గమే శాసిస్తున్నందన వారిని కట్టడి చేయాలంటే ఇసుక దొరక్కుండా చేయాలని భావించింది. నిర్మాణ రంగాన్ని శాసిస్తోన్న వర్గాన్ని కట్టడి చేయడానికి లక్షలాది అసంఘటిత రంగ కార్మికుల కడుపు కొడుతున్నామనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. నెలలు గడుస్తున్నా ఇసుక మార్కెట్‌లో దొరకడం లేదు. అదే సమయంలో నిషేధం అమల్లో ఉన్న సమయంలో సైతం ముఖ్యమంత్రి క్యాంపు నివాసం సమీప గ్రామాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ఇసుక తరలిపోయేది. ఇప్పటికీ రాత్రి పదకొండు దాటితే తాడేపల్లి నుంచి విజయవాడ బెంజిసర్కిల్‌ వరకు వీధి దీపాలు ఎందుకు ఆరిపోతాయో? వారధి మీద బారులు తీరే ఇసుక వాహనాలు హైవేల మీదుగా ఎక్కడికి వెళతాయో అంతుచిక్కని రహస్యం. డబ్బు, అధికారం ఉన్న వారికి ఎప్పుడైనా కావాల్సింది లభిస్తుంది. కానీ పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఇసుక దొరక్క మధ్యలో నిలిచిపోయిన మొండి గోడల ఇళ్లు, ఆ పనుల మీద బతికే రోజువారి కూలీలు మాత్రం ప్రభుత్వానికి ఐదు నెలలుగా కనిపించకపోవడం విచిత్రమే. కృష్ణా నదిలో వరదల వల్ల 70 రోజులుగా ఇసుక తవ్వకాలు జరగలేదని చెప్పుకోవడం సాకులు వెదుక్కోవడమే అవుతుంది.అధికార మార్పిడి జరిగిన ఐదు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నా చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడానికి కారణమేమిటో అర్థం కాదు. 151మంది ఎమ్మెల్యేల గెలిచినా వారెవ్వరికీ ఆ గెలుపులో భాగం లేదనే జగన్మోహన్ రెడ్డి భావన కూడా దీనికి కారణం కావొచ్చు. మంత్రులు, ముఖ్యమంత్రికి చెప్పే స్థితిలో లేకపోవడం, జనం గెలిపించిన ఎమ్మెల్యేలు, జగన్ మెచ్చిన మంత్రులు కూడా నిమిత్తమాత్రంగానే మిగిలిపోయారు. ఇక సలహాదారులుగా తిష్టవేసిన వారిలో చాలామంది ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆశ్రయం పొందిన వారే కావడంతో వారికి శాలరీ తప్ప సమస్యల్ని ప్రస్తావించే ధైర్యం లేదు. అధికారులు, మంత్రుల పరిధిలో వేలు పెట్టే వారితో మరో రకం సమస్య తలెత్తుతోంది. చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి నిర్ణయాలను సైతం సలహాదారులు అమోదించాల్సి వస్తోందంటే అక్కడ ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు