విజయవాడ, నవంబర్ 20 (way2newstv.com)
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అనూహ్యమైన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమి చవిచూసిన తర్వాత ఇప్పటి వరకు ఫర్వాలేదులే అనుకున్న పార్టీలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ.. జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఇసుక దీక్ష పేరుతో ఆయన పెద్ద దీక్ష చేశారు. అయితే, అదేరోజు టీడీపీలో అనేక సంచలనాలు చోటు చేసుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ పార్టీకి రిజైన్ చేయడంతోపాటు, గుడివాడ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న కమ్మ వర్గానికే చెందిన దేవినేని అవినాష్ ను ఏకంగా వైసీపీ తన పార్టీలోకి చేర్చుకుంది.ఈ రెండు పరిణామాలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.
ఇంచార్జీలకు దిక్కు లేకపోయానే
అయితే, అంతగా మీడియా ముందుకు రాని మరో కీలక పరిణామాలు కూడా ఈ నాలుగు రోజుల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా టీ గన్నవరం ఇంచార్జ్‌గా ఉన్న నేల పూడి స్టాలిన్ బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీలో ఉండలేకే ఆయన అసమ్మతి గళం వినిపించడంతో ఆయన్ను సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి. ఇక అంతకు ముందే అదే జిల్లాకు చెందిన ప్రత్తిపాడు ఇన్‌చార్జ్ వరుపుల రాజా సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు.ఇక, రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కొన్నాళ్ల కిందట పార్టీ మారిపోయారు. దీంతో ఈ నియోజకవర్గం టీడీపీ కూడా ఖాళీ అయింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఏకంగా ముగ్గురు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పార్టీని వీడారు. ఇక కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్‌ది అదే పరిస్థితి. ఇలా ఇక్కడ పార్టీ ఖాళీ అయితే, మరికొన్ని చోట్ల కూడా పార్టీ ఖాళీ అయ్యే సంకేతాలు వస్తున్నాయి. వచ్చే నెల రోజుల్లోనే మరో ఐదు నియోజవకర్గాల్లో పార్టీ ఖాళీ అవుతుందని అంటున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అరకులోయ పార్టీ ఇంచార్జ్ కిడారి శ్రావణ్ కుమార్, విశాఖ జిల్లా యలమంచిలి ఇంచార్జ్ పంచకర్ల రమేష్ కూడా జంపింగుల జాబితాలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.దీంతో ఇప్పటికే ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను నియమించాల్సి ఉంది. ముఖ్యంగా కీలకమై న కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరంలలో పాత వారినే నియమిస్తారా ? లేక కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా ? అనేది ఆసక్తిగా మారింది. పాతవారికి ఛాన్స్ ఇచ్చేటట్టయితే గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని పూర్ణ వీరయ్య వంటి వారు ఉన్నారు. ఇక, గన్నవరం విషయానికి వస్తే.. . గద్దె అనురాధ ఒక్కరే స్థానికంగా పట్టున్న నాయకురాలిగా కనిపిస్తున్నారు. అయితే, ఈ ఫ్యామిలీ ప్రస్తుతం పార్టీ పరిస్థితి చూసి తమకు విజయవాడ తూర్పు చాలు.. ఇంక గన్నవరం వద్దులే అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని నియమించాలనేది ఇబ్బంది కరమేనని అంటున్నారు పరిశీలకులు.
Tags:
Andrapradeshnews