చిరాగ్ పాశ్వాన్ కు కొత్త బాధ్యతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిరాగ్ పాశ్వాన్ కు కొత్త బాధ్యతలు

పాట్నా, నవంబర్ 11 (way2newstv.com)
చిన్న పార్టీ కావచ్చు… పెద్ద పార్టీ కావచ్చు.. కానీ వారసత్వం మాత్రం దేశ వ్యాప్తంగా అందరిదీ ఒకే దారి. ఏ పార్టీని చూసినా వారసులే పార్టీ అధినేతలు అవుతుండటం రివాజుగా వస్తుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ దగ్గర నుంచి మొదలు పెడితే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలూ ఇదే తరహా వారసత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి. వారికి నాయకత్వ లక్షణాలున్నాయా? లేవా? అన్నది పక్కన పెడితే తండ్రి లేదా సంబంధిత పార్టీ పెద్ద నుంచి వచ్చిన రక్త సంబంధంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయని క్యాడర్ ఆశిస్తుంది. అయితే ఎన్నికల్లో మాత్రం కొందరు వారసులు పార్టీని నడపలేక చతికలపడుతున్నారు.ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ పార్టీ స్థాపించి విజయపథాన పయనింప చేస్తే, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ మాత్రం పార్టీని నడపలేకపోతున్నారు. 
చిరాగ్ పాశ్వాన్ కు కొత్త బాధ్యతలు

వ్యూహాలు లేక సతమతమవుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సయితం తన తదనంతరం మేనల్లుడికి బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా తన వారసుడిగా మేనల్లుడినే ఎంపిక చేసుకోవడం విశేషం.ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ వారసత్వ రాజకీయాలు తక్కువేమీ కావు. తమిళనాడులో కరుణానిధి మరణం తర్వాత ఆయన తనయుడు స్టాలిన్ పార్టీని నడుపుతున్నారు. అన్నాడీఎంలో మాత్రం వారసులు లేకపోవడంతో బయట నేతలే పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ను తన వారసుడిగా ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ అదే బాటలో ఉన్నారు. ఇలా వారసులకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఎవరూ వెనకాడటం లేదు.తాజాగా లోక్ జనశక్తి పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎంపిక అయ్యారు. రామ్ విలాస్ పాశ్వాన్ 2000 సంవత్సరంలో లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించారు. కొన్ని స్థానాలకే పరిమితమయినా బీహార్ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ను పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. చిరాగ్ పాశ్వాన్ ఇప్పటికే రెండు దఫాలు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీహార్ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉండటంతో రామ్ విలాస్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని తనయుడికి అప్పగించారు.