మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు

కొలంబియా తరహాలో నిర్మాణాలు
విజయవాడ, నవంబర్ 21  (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలను తీసుకురావాలని భావిస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులతో కాన్సెప్ట్ సిటీలతో పాటూ మిగిలిన అంశాలపై చర్చించారు. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.ఈ సిటీలను ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అమెరికాలోని ఇండియానాలో ఉన్న కొలంబియా సిటీని ప్రస్తావించిన జగన్.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి, హై ఎండ్‌ టెక్నాలజీకి అడ్రస్‌గా ఈ సిటీలు తయారు ఉండాలన్నారు. 
మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు

కంపెనీ సామర్థ్యాన్ని బట్టి అక్కడ భూములు కేటాయించాలని.. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి అనుమతులు వీలైనంత త్వరగా ఇవ్వడం.. అవినీతికు అవకాశం లేకుండా పారదర్శకంగా వసతులు కల్పించాలన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా మంచి మానవ వనరులను అందించాలని సీఎం జగన్ అన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీళ్లు, కరెంటు అందించాలన్నారు.ఇటు ఐటీ శాఖకు సంబంధించి సీఎం సమీక్ష చేశారు. ఒకే పనిని రెండు మూడు విభాగాలు చేస్తుండటంతో ఓవర్‌ ల్యాపింగ్‌ అవుతోందని.. అధికారులు సీఎంకు వివరించారు. ఐటీ శాఖ చాలా అప్లికేషన్లు అందుబాటులోకి తెచ్చినా.. సరైన సమన్వయం లేకపోవడంతో ఆయా శాఖలు కొత్త అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వపరమైన వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామన్నారు.ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్‌ కావాలన్నా ముందు ఐటీశాఖ అనుమతి ఇచ్చాకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సర్క్యులర్‌ జారీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఐటీ విభాగంలో ఉన్న సదుపాయాలు, వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఎక్కడా డూప్లికేషన్‌ లేకుండా ఐటీ శాఖలోని ఒక్కో విభాగానికి ఒక్కో పని అప్పగించాలన్నారు. ఆర్టీజీఎస్‌కు అనాలిటిక్స్‌ బాధ్యతను అప్పగించడం ద్వారా పూర్తి స్థాయి సేవలు ఉపయోగించొచ్చని అధికారులు చెప్పగా.. సీఎం ఓకే చెప్పారు.ఇటు పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కోసం గ్రామ, వార్డు సచివాలయాలు.. వలంటీర్ల వ్యవస్థను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. నేరుగా కలెక్టర్‌కు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం ఉండాలని.. దీనికి అవసరమైన సమాచార సాంకేతిక వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. పరిపాలన వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని.. దీంతో అవినీతిని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయానికి వచ్చే వినతులు, ఆర్జీలు ఏ దశలో ఉన్నాయో నేరుగా కంప్యూటర్లో చూసే అవకాశం ఉండాలన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్డులను గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి ఇవ్వాలని సూచించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన ఐటీ వ్యవస్థ ఉండాలన్నారు ముఖ్యమంత్రి