ఏపీపై బీజేపీ ఆశలు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీపై బీజేపీ ఆశలు...

అనంతపురం నవంబర్ 5 (way2newstv.com)
బయట మాత్రమే బడాయి. లోపలంతా భాయీ భాయీ అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేశారు. లోగుట్టు మొత్తం విప్పేశారు. ఆ రెండు పార్టీలు బీజేపీతో కలవాలని తెగ ఆరాటపడుతున్నాయి అని కూడా సీక్రెట్ బయటపెట్టేసారు. అయితే ఆ రెండు పార్టీలతో తాము అసలు కలవమని భారీ స్టేట్ మెంట్ ఇచ్చేసిన రెడ్డి గారు ఏపీలో బీజేపీదే హవా అంటూ గొప్పలు చెప్పుకున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో జెండా ఎగరేసేది, అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని కూడా ఆయన ఢంకా భజాయించారు. ఆ విషయమెలా ఉన్నా కూడా బాబు, పవన్ బీజేపీ ప్రాపకం కోసం అల్లల్లాడుతున్నారంటూ చెప్పడం ద్వారా రెండు పార్టీల పరువు మాత్రం తీసేశారు.
ఏపీపై బీజేపీ ఆశలు...

బీజేపీ సర్కార్ మీద మూడేళ్ల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గట్టిగా గర్జించిన సంఘటనలు, సందర్భం అందరికీ ఇపుడు గుర్తురాక మానదు. పాచిపోయిన లడ్డూలు అంటూ తిరుపతి, కాకినాడ సభల్లో బీజేపీ ప్రత్యేక ప్యాకేజిని హేళన చేస్తూ మాట్లాడి ఆ రోజుల్లో హీరో అయిపోయారు. బీజేపీని, మోడీని ఎదిరించే సత్తా తనకే ఉందని కూడా చెప్పుకున్నారు. ఉత్తరాది, దక్షిణాదిగా దేశాన్ని ముక్కలు చేస్తున్నారంటూ మోడీ మీద మండిపడ్డారు. మరి ఇంతలో ఏమైందో కానీ పవన్ మాత్రం కాషాయంలో చేతులు కలపాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇపుడు మాత్రం కేంద్రంలోకి బీజేపీ ఏపీకి ఏం చేసిందని, పాచిపోయిన లడ్డూలు కూడా ఇవ్వలేదుగా, ప్యాకేజ్ అలా పోయింది, హోదా ఇలా పోయింది. మరి బీజేపీని ఇపుడు కౌగిలించుకుంటానంటే అందులో ప్రజలకు మేలు చేసే పరమార్ధం ఉందా, లేక రాజకీయ అవకాశవాదం ఉందా అన్నది పవనే చెప్పాలంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీకి కనీసం సంస్థాగత నిర్మాణమే లేదని బీజేపీ రెడ్డి గారు ఎకసెక్కం ఆడారు. ఇలా పవన్ పార్టీని పూచిక పుల్లగా తీసిపారేసిన తీరు చూశాక ఇంకా ఆయన అదే పార్టీని కోరుకుంటారా అన్నది కూడా ఆలోచించాలిగా.దీని అర్ధమేంటో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డే చెప్పాలి మరి. ఏపీలో టీడీపీని లిమిటెడ్ పార్టీ అన్నారు. లిమిటెడ్ కంపెనీలా ఒక సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్న పార్టీ, ఒక కుటుంబం పార్టీ అన్న విమర్శ అందులో ఉందో, లేక ఏపీలో కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమై ఉందని సెటైర్లు వేశారో కానీ టీడీపీ మీద భారీగానే పంచ్ లు వేశారు. టీడీపీతో పొత్తు అసలు వద్దే వద్దు అని రెడ్డి గారు కసురుకున్నట్లుగా మాట్లాడడం బట్టి చూస్తూంటే ఏపీలో పసుపు శిబిరం గుండెల్లో గుబులు రేగక మానదుగా. మాకు మంచి నాయకులు కావాలి. స్వార్ధపరులు వద్దు అంటూ వేసిన కౌంటర్లు కూడా పొత్తులు, ఎత్తులు అంటూ వెంపర్లాడుతున్న వారికి ఘాటు సమాధానంగానే చూడాలి. ఏది ఏమైనా బీజేపీ విష్ణు మాత్రం ఏపీలో టీడీపీకి, జనసేనకు అంత సీన్ లేదని, ఉన్నది కూడా కాలిందని పక్కా క్లారిటీగా చెప్పేశారుగా. ఇంకా వెంటబడతామంటే మాత్రం ఆ రెండు పార్టీలదే ఇష్టమన్నట్లుగా కమలం తీరు ఉంది.